సాక్షి, చెన్నై : ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది.
ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి కిరణ్ బేడి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే నిద్రపోయారు. సీఎంకు మద్దతుగా మంత్రులు, డీఎంకే కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ విషయం గురించి నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలి. అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ.. రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాక నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే కిరణ్ బేడి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నారాయణస్వామి చేపట్టిన ధర్నాకు డీఎంకే కూడా మద్దతు పలకటంతో భారీ సంఖ్యలో జనాలు రాజ్ భవన్ ముందుకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment