సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అధికార సమరంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాలతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి సర్కారుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కారుకు పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారారు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికార సమరం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా, దానిని అడ్డుకున్నారు.
ఉచిత బియ్యంకు బదులుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీకి తగ్గ ఉత్తర్వులు ఇచ్చి సీఎంకు ఆమె షాక్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టు సైతం సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి అప్పీలుకు వెళ్లి ఉన్నారు. అదే సమయంలో పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో క్లబ్స్ (పేకాట) ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంలో కిరణ్ జోక్యం చేసుకున్నారు. క్యాసినోకు నో చెప్పేస్తూనే, చెక్ పెట్టేశారు. ఈ పరిణామాలు సీఎం నారాయణ స్వామి సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో దెబ్బ ఆ సర్కారుకు తప్పలేదు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!
ఎన్నికల కమిషనర్ నియమకంలో..
పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణన్‌ను సీఎం నారాయణస్వామి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి చెక్ పెడుతూ కిరణ్ కొత్త బాట వేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారి నియమకానికి సంబంధించి పత్రికలకు ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి, అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాలకృష్ణన్ బాధ్యతలు స్వీకరించడంతో, ఆయన నియమక ఉత్తర్వులను రద్దుచేస్తూ కిరణ్ మరో ఉత్తర్వులిచ్చారు. వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మంత్రి నమశివాయం కోర్టు తలుపులు తట్టారు. కొన్ని నెలలుగా విచారణలో ఉంటూ వచ్చిన ఈ పిటిషన్ గురువారం తిరస్కరణకు గురైంది.
అఖిల భారత స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారిని ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక చేయడం అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది కొత్త మార్గం అని, దీనిని ఆహ్వానించాల్సిన అవసరం ఉందంటూ, ఎన్నికల కమిషనర్ నియమకాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సమర్థించారు. ఎన్నికల కమిషనర్ నియమకంలో నారాయణ సర్కారు భంగ పాటే కాదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పరిస్థితి మారింది. వరుసగా తమ సర్కారుకు ఎదురు దెబ్బలు కోర్టు రూపంలో తగులు తుండడంతో నారాయణకు సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదు. చదవండి: సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment