‘ఒంటరి మహిళ’కు 35 ఏళ్ల వయో పరిమితి!
ఆసరా పథకం వర్తింపునకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న సెర్ప్
సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం ద్వారా ఆర్థికభృతిని పొందాలనుకునే ఒంటరి మహి ళలకు కనీస వయో పరిమితిని 35 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎటువంటి ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెలకు రూ.వెయ్యి చొప్పున సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నందున అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మార్గదర్శ కాలను రూపొంది స్తోంది. వివాహం చేసుకోని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, విడాకులు తీసుకోకుండా భర్త నుంచి విడిగా ఉంటున్న వారు, దేవునితో పెళ్లైన జోగినులను.. ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. ఆయా కేటగిరీల మహిళలంతా తల్లిదండ్రులతో గానీ, తోబుట్టువులతో గానీ కలసి ఉంటున్నట్లయితే ఒంటరి మహిళలుగా పరిగణించకూడదని భావిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆర్థిక భృతిని పొందేం దుకు ఆసరా పథకంలో లబ్ధిదారులకు వర్తించే నియమ నిబంధనలే ఒంటరి మహిళలకు కూడా వర్తించనున్నాయి. భర్తతో విడిపోయిన మహిళలు కనీసం నాలుగేళ్ల పాటు ఒంటరిగా నివసిస్తున్నవారై ఉండాలి. జోగినులకు సంబంధించి రాష్ట్రంలో 14,963 మంది ఉన్నట్లు వి.రఘునాథరావు కమిషన్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ చేయించిన సర్వేలో వెల్లడైంది. అయితే.. అ సర్వే వివరాలను పరిశీలించి ఎంతమంది జీవించి ఉన్నారో లెక్కలు తేల్చాలని ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను సర్కారు ఆదేశించింది. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతికి సంబంధించిన మార్గదర్శకాలపై సెర్ప్ అధికారులు, తుది కసరత్తు కోసం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్తో సమావేశం కానున్నారు. సెర్ప్ రూపొందించిన మార్గదర్శకాలకు సీఎస్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.