శశికళకే పూర్తి హక్కులు: దినకరన్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాల్లో శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వం మైనార్టీలో ఉందంటూ హస్తినకు తమిళ రాజకీయాలను మోసుకెళ్లగా, దినకరన్ కూడా బల నిరూపణ అంశంను తెరపైకి తీసుకొచ్చి పళనిని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు.
ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు దినకరన్ శిబిరంలోకి చేరిపోగా, పళని-పన్నీర్ గ్రూపులో స్లీపర్ సెల్స్ ఉన్నారని, వలసలు కొనసాగుతాయంటూ రిసార్ట్ లో సేదతీరుతున్న దినకరన్ వర్గ నేతలు హింట్ కూడా ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు శశికళకే ఉంటుందని దినకరన్ చెప్పుకొచ్చారు. శశికళ బహిష్కరణ నేపథ్యంలో కొత్త జనరల్ సెక్రటరీని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 12న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.
అయితే మీటింగ్ నిర్వహించే హక్కు ప్రధాన కార్యదర్శిగా శశికళకు తప్ప ఎవరికీ ఉండదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సమావేశానికి ఎవరూ హాజరుకావొద్దంటూ పార్టీ సభ్యులకు దినకరన్ సూచించారు. కాగా, సోమవారం సీఎం పళనిస్వామి నేతృత్వంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళ, దినకరన్‌లను బహిష్కరించటం, వారి నిర్ణయాలు చెల్లవంటూ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యేలు:
శశికళ మరియు దినకరన్ వర్గాల ఎమ్మెల్యేలు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి తాము ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సెప్టెంబర్ 5లోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ ధన్పాల్ మరో దఫా 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఇక బలనిరూపణకు గవర్నర్ ను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.