సినీ తారలపై అభిమానం ప్రాణం తీసింది
వడోదరా: రైలులో వచ్చిన సన్నీ లియోన్‌ను చూసి అభిమానులు రెచ్చిపోయారు. ఆమె కూర్చున్న బోగీని వందలమంది చుట్టుముట్టారు. కొందరు గాజు కిటికీలపై దబాదబా చప్పుడు చేయగా, ఇంకొందరు రైలు పైకెక్కి హంగామా చేశారు. అభిమానుల వీరంగాన్నిచూసి నిశ్చేష్టురాలైన హీరోయిన్ విండో కర్టెన్ మూసేసింది. అయినాసరే అభిమానులు ఆగలేదు.
ఇంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అదే రైలులో ప్రయాణిస్తోన్న సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. వేలమంది ఒకేసారి దూసుకురావడం తొక్కిసలాటకు దారితీసింది. సన్నీ లియోన్, షారూఖ్ ఖాన్‌లను చూసేందుకు భార్య, కూతురితో వచ్చిన ఓ వ్యక్తి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్‌లోని వడోదరా రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
జనవరి 25న విడులకానున్న ’రయీస్’ సినిమా ప్రచారంలో భాగంగా హీరో షారూఖ్‌ఖాన్, ఆ సినిమాలో ’లైలా ఓ లైలా..’పాటలో నర్తించిన సన్నీ లియోన్, చిత్రబృందంలోని ఇతరులు సోమవారం రైలు యాత్ర చేపట్టారు. సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో వీరు ప్రయాణించారు. సన్నీ లియోన్ బురఖా ధరించి రైలు ఎక్కినట్లు తెలిసింది.
ఇంజన్ మార్పిడి కోసం గుజరాత్‌లోని వడోదర స్టేషన్లో రైలును కాసేపు నిలిపారు. అప్పటికే పలు మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన మేరకు భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానుల రూపంలో వచ్చిన ఆకతాయిలకు అడ్డులేకుండాపోయింది. సన్నీ లియోన్ కూర్చున్న బోగీని వందలమంది చుట్టుముట్టి నానా హంగామా చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
ఇటు షారూఖ్‌ను కూడా అభిమానులు చుట్టుముట్టారు. పోలీసుల సూచనమేరకు.. షారూఖ్ రైలు దిగకుండా డోర్ వద్దే నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. 10 నిమిషాల తర్వాత ఇంజన్ సిద్ధం కావడంతో రైలు బయలుదేరింది. అప్పుడుకూడా కొందరు వ్యక్తులు రైలును వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మళ్లీ లాఠీలకు పనిచెప్పారు. అక్కడున్నవారిని బయటికి తరిమేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో వడోదరకే చెందిన ఫరీద్ ఖాన్ షెరానీ ప్రాణాలు కోల్పోయాడు. ఊపిరి అందకపోవడం వల్లే అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. 50ఏళ్ల ఫరీద్.. షారూఖ్ వీరాబిమాని అని, భార్య, కూతురితో కలిసి అభిమాన తారలను చూసేందుకు వచ్చాడని పోలీసులు తెలిపారు. కానీ బంధువులను రిసీవ్ చేసుకోవడానికే ఫరీద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడని అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఢిల్లీలో రైలు దిగిన వెంటనే షారూఖ్ ఈ ఘటనపై స్పందించాడు. ఫరీద్ మృతి దుదృష్టకరమని, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నానని షారూఖ్ అన్నాడు.