వైభవ్ జెమ్స్, కంకార్డ్ బయోటెక్ ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్‌తోపాటు రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు పెట్టుబడులున్న కంకార్డ్ బయోటెక్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆగస్ట్‌లో కంకార్డ్, సెప్టెంబర్‌లో వైభవ్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం..
వైభవ్ జెమ్స్
బంగారు ఆభరణాల విక్రేత వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ గ్రంధి భారత మల్లికా రత్న కుమారి(హెచ్‌యూఎఫ్) 43 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 12 కోట్లను 8 కొత్త షోరూముల ఏర్పాటుకు వినియోగించనుంది. రెండేళ్లపాటు ఇన్వెంటరీ కొనుగోలుకి మరో రూ. 160 కోట్లు కేటాయించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలను కంపెనీ విక్రయిస్తోంది. అంతేకాకుండా విశేష బ్రాండు ద్వారా ప్రీమియం జ్యువెలరీని అందిస్తోంది.
కంకార్డ్ బయోటెక్
ఫెర్మంటేషన్ ఆధారిత బయోఫార్మాస్యూటికల్ ఏపీఐల తయారీ కంపెనీ కంకార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా పీఈ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌కు చెందిన హెలిక్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 2.09 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంకార్డ్లో దివంగత రాకేశ్ జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖ ఏర్పాటు చేసిన రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం పెట్టుబడులున్నాయి. కంపెనీ ప్రధానంగా అంకాలజీ, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ తదితర ప్రత్యేక విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గుజరాత్లో మూడు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2022 మార్చికల్లా కంపెనీ 56 బ్రాండ్లతో 65 ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిలో 22 ఏపీఐలు, 43 ఫార్ములేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ దేశాలలో 120 డీఎంఎఫ్‌లను దాఖలు చేసింది.వైభవ్ జెమ్స్ ఐపీవోకు ఓకేకంకార్డ్ బయోటెక్‌కూ సెబీ అనుమతి