vakfu lands
-
ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారు?
కర్నూలు : జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతుంటే మీరేం చేస్తున్నారంటూ బోర్డు కమిటీ సభ్యులు, అధికారులపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాష సీరియస్ అయ్యారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన ఆయన స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతోనూ మాట్లాడారు. స్థానిక మహ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కార్యాలయంలో బోర్డు కమిటీ సభ్యులు, అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా వక్ఫ్‌బోర్డు భూములు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని, అన్యాక్రాంతమైన భూములు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వార్షిక నివేదిక వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆక్రమణకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకుని కమ్యూనిటీ ప్రయోజనం కోసం ఉపయోగిస్తామన్నారు. పెళ్లికానుక పథకాన్ని వైఎస్ఆర్ దుల్హన్ పథకంగా మార్పుచేసి, పేద వధువులకు వారి పేరిట కాకుండా తల్లిదండ్రుల పేరిట చెక్కు పంపించే ఆలోచన చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రూ. 50 వేలు ఆర్థిక సాయం వస్తే అందులో దళారులకే రూ. 20 వేల దాకా ఖర్చయ్యేదని, కానీ నేడు నయాపైసా తగ్గకుండా రూ. లక్ష అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌వలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబ్బర్బాష తదితరులు పాల్గొన్నారు. ఉర్దూ వర్సిటీలో అవినీతిపై విచారణ కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్బాష స్పష్టం చేశారు. వర్సిటీకి వచ్చిన ఆయన దృష్టికి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ముజఫర్ అలీ, కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థి సంఘాల నేతలు, వర్సిటీ విద్యార్థులు పలు సమస్యలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వర్సిటీ అద్దె భవనాల్లో కొనసాగడం బాధాకరమన్నారు. 2016లో వర్సిటీ ఏర్పాటయితే ఇంత వరకు సొంత భవనం నిర్మాణం కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణం ఏ ద«శలో ఉందని అడిగి తెలుసుకున్నారు. నిధులు లేక నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని వీసీ వెల్లడించారు. నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్‌ను మంత్రికి చూపించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించారని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రిజిస్ట్రార్ తన భర్తకు పోస్టు ఇప్పించుకోవడానికే తమను తొలగించారని, రాష్ట్రంలో ఏ వర్సిటీలో లేని విధంగా గెస్ట్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించిన రిజిస్ట్రార్ భర్తకు సెమిస్టర్‌కు రూ.1.20 లక్షల చొప్పున చెల్లించారని తెలిపారు. వీసీ ముజఫర్ అలీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ సాహెదా అక్తర్లను కాంట్రాక్ట్ స్టాఫ్ సమస్య గురించి మంత్రి అడగ్గా.. ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. దీంతో డిప్యూటీ సీఎం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్‌రెడ్డి డిప్యూటీ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఉస్మానియా కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి ఉస్మానియా కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్బాష హామీ ఇచ్చారు. కరస్పాండెంట్ అజ్రాజావేద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన హాజిరా కాలేజీకి మున్సిపల్ అధికారులు రూ. లక్షల్లో పన్ను విధించారని కరస్పాండెంట్ అజ్రాజావేద్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. పన్ను మినహాయించేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించారు. ప్రొటోకాల్ విస్మరణ డిప్యూటీ సీఎం పర్యటన విషయంలో మైనార్టీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉర్దూ వర్సిటీ ఉంది. అయితే.. అధికారులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సరైన సమాచారం ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అంజాద్ బాష ఉర్దూ వర్సిటీకి ఉదయం 10.30 గంటలకే చేరుకోగా.. ఆయన వచ్చిన 15 నిమిషాల తరువాత సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు నింపాదిగా రావడం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. -
గుండెల్లో రైళ్లు
వెలుగు చూసిన రూ.200 కోట్ల విలువైన వక్ఫ్ భూములు అమలాపురం వడ్డిగూడెంలో 27.95 ఎకరాల గుర్తింపు మున్సిపల్ కమిషనర్ క్వార్టర్లు, పార్కు కూడా ఆ భూముల్లోనివే.. ఆ ప్రాంతంలో రిజిసే్ట్రషన్ల ప్రక్రియ నిలిపేసిన ఆర్డీవో గుబులు చెందుతున్న ఇళ్ల యజమానులు కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో ఖరీదైన ఇళ్లు, భారీ అపార్ట్మెంట్లతో ఉన్న వడ్డిగూడెం ప్రాంతవాసుల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ ప్రాంతంలోని సర్వే నంబర్ 455లో ఉన్న 27.95 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు చెందినవిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు నిర్ధారించడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పటికే ఆ భూముల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు నిర్మించుకున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అమలాపురం టౌ¯ŒS : అమలాపురం పట్టణంలో వడ్డిగూడెం రోడ్డులో వెళ్తున్నప్పుడు కుడివైపు ఖరీదైన భవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతమది. ఇక్కడి సర్వే నంబర్ 455 లో 27.95 ఎకరాల భూముల్లో చాన్నాళ్ల కిందట అనేకమంది రూ.లక్షలు పెట్టి స్థలాలు కొనుగోలు చేశారు. రూ.లక్షలు పోసి ఇళ్లు కట్టుకున్నారు. ఇదే సర్వే నంబరులో మున్సిపల్ కమిషనర్ క్వార్టర్స్, మున్సిపల్ పార్కు, మున్సిపల్ పాఠశాల కూడా ఉన్నాయి. ఇన్నాళ్లుగా తాము ఉంటున్న ఆ స్థలాలు వక్ఫ్‌బోర్డుకు చెందినవిగా అధికారులు నిర్ధారించడంతో అక్కడివారి గుండెల్లో గుబులు బయలుదేరింది. వక్ఫ్ బోర్టుకు చెందినవిగా చెబుతున్న ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం కనీసం రూ.200 కోట్ల వరకూ ఉండవచ్చన్నది అంచనా. ఆ భూముల్లో ప్రస్తుతం మూడు అపార్ట్మెంట్లు, ఒక పెద్ద ప్రైవేటు ఆస్పత్రి, మూడు వాణిజ్య సముదాయాలు, 140 వరకూ ధనికుల ఇళ్లు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ భూములు, భవనాల విలువ సుమారు రూ.500 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. వెలుగు చూసిందిలా.. 1957కు ముందు ఇక్కడి భూములు ఓ మసీదుకు సంబంధించిన వక్ఫ్ భూములుగా ఉన్నట్లు కొందరు ముస్లింలు గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన ఆ శాఖ కార్యదర్శి దీనిపై హైదరాబాద్ నుంచి ఇద్దరు అధికారులను పది రోజుల కిందట అమలాపురం పంపించి విచారణ చేయించారు. ఆ అధికారులు రెవెన్యూ పాత రికార్డులు (అడంగళ్లు) లోతుగా పరిశీలించారు. ఈ సర్వే నంబరులో మొత్తం భూమి పూర్వం వక్ఫ్‌కు చెందినవని గుర్తించారు. అయితే 1957 తర్వాత ఆ భూములను కొందరు ఆక్రమించుకోవటం లేదా.. వాటిపై హక్కులు ఉన్నవారు పర్యవేక్షణ లోపం లేదా.. అనధికారికంగా విక్రయించటం వంటి పరిణామాలు చోటుచేసుకుని ఉండవచ్చని వక్ఫ్ అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ కార్యదర్శి అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. వాటిని వక్ఫ్ బోర్డుకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని.. ప్రస్తుతానికి ఆ 27.95 ఎకరాల్లో ఎలాంటి క్రయవిక్రయాలూ జరగకుండా రిజిసే్ట్రషన్లు బంద్ చేయించాలని సూచించారు. దీంతో ఆర్డీవో స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. 455 సర్వే నంబరులోని ఉన్న భూముల్లో క్రయవిక్రయాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ సర్వే నంబరులో ఉన్న భూముల లావాదేవీలను పూర్తిగా బ్లాక్ చేశారు. జటిలంగా మారిన సమస్యను ఎలా పరిష్కరిస్తారోనని పట్టణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మా భూములు మాకుఅప్పగించాల్సిందే.. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూండగా.. ముస్లిం పెద్దలు మాత్రం ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆ భవనాల ద్వారా వచ్చే అద్దెలను వక్ఫ్ ఆదాయంగా పరిగణించాలని పట్టుపడుతున్నారు. దీంతో సున్నితమైన ఈ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భూముల స్వాధీనం అంటూ జరిగితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాల్సి ఉంటుంది. పట్టణంలోనే కచేరీ చావిడి వద్ద కూడా వక్ఫ్ భూములు ఉన్నట్టుగా సంబంధిత అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి, సమనస, తాండవపల్లి గ్రామాల్లో కూడా 70 ఎకరాల వరకూ వక్ఫ్ భూములున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆ భూములపై కూడా రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. రికార్డుల్లో మసీదు భూములుగానే ఉన్నాయి వడ్డిగూడెంలో 455 సర్వే నంబరులోని 27.95 ఎకరాలు పూర్వం మసీదు భూములుగా ఉన్న మాట వాస్తవమే. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ విషయం గుర్తించాం. నాలుగైదు రోజుల్లో రెవెన్యూ బృందాల చేత క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తాం. ఆ భూముల పరిధిలోకి ఏయే భవనాలు వచ్చాయో అధికారికంగా మరింత కచ్చితంగా నిర్ధారిస్తాం. ప్రస్తుతానికి ఈ భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు విధించాం. – జి.గణేష్‌కుమార్, ఆర్డీవో, అమలాపురం