గుండెల్లో రైళ్లు
-
వెలుగు చూసిన రూ.200 కోట్ల విలువైన వక్ఫ్ భూములు
-
అమలాపురం వడ్డిగూడెంలో 27.95 ఎకరాల గుర్తింపు
-
మున్సిపల్ కమిషనర్ క్వార్టర్లు,
-
పార్కు కూడా ఆ భూముల్లోనివే..
-
ఆ ప్రాంతంలో రిజిసే్ట్రషన్ల ప్రక్రియ నిలిపేసిన ఆర్డీవో
-
గుబులు చెందుతున్న ఇళ్ల యజమానులు
కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో ఖరీదైన ఇళ్లు, భారీ అపార్ట్‌మెంట్లతో ఉన్న వడ్డిగూడెం ప్రాంతవాసుల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ ప్రాంతంలోని సర్వే నంబర్ 455లో ఉన్న 27.95 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు చెందినవిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు నిర్ధారించడమే ఇందుకు కారణం. దీంతో ఇప్పటికే ఆ భూముల్లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు నిర్మించుకున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అమలాపురం టౌ¯ŒS :
అమలాపురం పట్టణంలో వడ్డిగూడెం రోడ్డులో వెళ్తున్నప్పుడు కుడివైపు ఖరీదైన భవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతమది. ఇక్కడి సర్వే నంబర్ 455 లో 27.95 ఎకరాల భూముల్లో చాన్నాళ్ల కిందట అనేకమంది రూ.లక్షలు పెట్టి స్థలాలు కొనుగోలు చేశారు. రూ.లక్షలు పోసి ఇళ్లు కట్టుకున్నారు. ఇదే సర్వే నంబరులో మున్సిపల్ కమిషనర్ క్వార్టర్స్, మున్సిపల్ పార్కు, మున్సిపల్ పాఠశాల కూడా ఉన్నాయి. ఇన్నాళ్లుగా తాము ఉంటున్న ఆ స్థలాలు వక్ఫ్‌బోర్డుకు చెందినవిగా అధికారులు నిర్ధారించడంతో అక్కడివారి గుండెల్లో గుబులు బయలుదేరింది. వక్ఫ్ బోర్టుకు చెందినవిగా చెబుతున్న ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం కనీసం రూ.200 కోట్ల వరకూ ఉండవచ్చన్నది అంచనా. ఆ భూముల్లో ప్రస్తుతం మూడు అపార్ట్‌మెంట్లు, ఒక పెద్ద ప్రైవేటు ఆస్పత్రి, మూడు వాణిజ్య సముదాయాలు, 140 వరకూ ధనికుల ఇళ్లు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ భూములు, భవనాల విలువ సుమారు రూ.500 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు.
వెలుగు చూసిందిలా..
1957కు ముందు ఇక్కడి భూములు ఓ మసీదుకు సంబంధించిన వక్ఫ్ భూములుగా ఉన్నట్లు కొందరు ముస్లింలు గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన ఆ శాఖ కార్యదర్శి దీనిపై హైదరాబాద్ నుంచి ఇద్దరు అధికారులను పది రోజుల కిందట అమలాపురం పంపించి విచారణ చేయించారు. ఆ అధికారులు రెవెన్యూ పాత రికార్డులు (అడంగళ్లు) లోతుగా పరిశీలించారు. ఈ సర్వే నంబరులో మొత్తం భూమి పూర్వం వక్ఫ్‌కు చెందినవని గుర్తించారు. అయితే 1957 తర్వాత ఆ భూములను కొందరు ఆక్రమించుకోవటం లేదా.. వాటిపై హక్కులు ఉన్నవారు పర్యవేక్షణ లోపం లేదా.. అనధికారికంగా విక్రయించటం వంటి పరిణామాలు చోటుచేసుకుని ఉండవచ్చని వక్ఫ్ అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ కార్యదర్శి అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. వాటిని వక్ఫ్ బోర్డుకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని.. ప్రస్తుతానికి ఆ 27.95 ఎకరాల్లో ఎలాంటి క్రయవిక్రయాలూ జరగకుండా రిజిసే్ట్రషన్లు బంద్ చేయించాలని సూచించారు. దీంతో ఆర్డీవో స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. 455 సర్వే నంబరులోని ఉన్న భూముల్లో క్రయవిక్రయాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ సర్వే నంబరులో ఉన్న భూముల లావాదేవీలను పూర్తిగా బ్లాక్ చేశారు. జటిలంగా మారిన సమస్యను ఎలా పరిష్కరిస్తారోనని పట్టణ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
మా భూములు మాకుఅప్పగించాల్సిందే..
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూండగా.. ముస్లిం పెద్దలు మాత్రం ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆ భవనాల ద్వారా వచ్చే అద్దెలను వక్ఫ్ ఆదాయంగా పరిగణించాలని పట్టుపడుతున్నారు. దీంతో సున్నితమైన ఈ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భూముల స్వాధీనం అంటూ జరిగితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాల్సి ఉంటుంది. పట్టణంలోనే కచేరీ చావిడి వద్ద కూడా వక్ఫ్ భూములు ఉన్నట్టుగా సంబంధిత అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి, సమనస, తాండవపల్లి గ్రామాల్లో కూడా 70 ఎకరాల వరకూ వక్ఫ్ భూములున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఆ భూములపై కూడా రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు.
రికార్డుల్లో మసీదు భూములుగానే ఉన్నాయి
వడ్డిగూడెంలో 455 సర్వే నంబరులోని 27.95 ఎకరాలు పూర్వం మసీదు భూములుగా ఉన్న మాట వాస్తవమే. రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ విషయం గుర్తించాం. నాలుగైదు రోజుల్లో రెవెన్యూ బృందాల చేత క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తాం. ఆ భూముల పరిధిలోకి ఏయే భవనాలు వచ్చాయో అధికారికంగా మరింత కచ్చితంగా నిర్ధారిస్తాం. ప్రస్తుతానికి ఈ భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు విధించాం.
– జి.గణేష్‌కుమార్, ఆర్‌డీవో, అమలాపురం