బీహార్ 'మిడ్ డే మీల్స్'లో మరొకరు అరెస్ట్
బీహార్ రాష్ట్రంలోని శరన్ జిల్లాలో ధర్మసతి గందమన్ గ్రామంలో పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విషాహారం తిని 23 మంది చిన్నారుల మృతి చెందిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొంత పురోగతి సాధించింది. ఆ కేసులో ఎరువుల వ్యాపారి వకిల్ రాయ్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. అతడు విష్ణుపుర్ గ్రామంలో ఎరువుల దుకాణం నడుపుతున్నట్లు చెప్పారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మీనా దేవీ భర్త అర్జున్ రాయ్ తమ విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు వకిల్‌ను ఆదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ కేసులో ఇప్పటికే హత్య, కుట్ర తదితర కేసులను మీనాదేవీపై నమోదు చేసినట్లు వివరించారు. ఆ కేసులో నిందితుడైన ఆమె భర్త అర్జున్ రాయ్ ఈ నెల 9న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో అతడిని విచారించిన పోలీసులకు పలు కీలక సమాచారం సేకరించారు. అందులోభాగంగానే వకిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది జులై 16న రాష్ట్రంలోని శరన్ జిల్లాలోని గందమాన్ గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం కింద కలుషిత ఆహారం తిని 23 మంది మరణించారు. దాంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నితీష్ ప్రభుత్వం నియమించింది. చిన్నారులకు వడ్డించిన ఆ ఆహార పదార్థాల్లో క్రిమిసంహారక మందులు కలసినట్లు ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో వెల్లడైంది. దాంతో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలులతోపాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.