‘వాలెట్ల’కు మార్చి గండం!
న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవంతో కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన మొబైల్ వాలెట్ సంస్థలకు ప్రస్తుతం కేవైసీ నిబంధనలు సంకటంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు నాటికి కస్టమర్లందరి వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయడానికి వాలెట్ సంస్థలు పరుగులు తీస్తున్నాయి. కానీ, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోపక్క, ప్రైవేటు సంస్థలు కస్టమర్ల నుంచి ఈ–కేవైసీ కోసం ఆధార్‌ను తీసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాలెట్ సంస్థలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. డెడ్‌లైన్ ముగియడానికి ఇంకా కొన్ని వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటిదాకా చాలా మటుకు సంస్థలు కేవలం కొద్ది మంది కస్టమర్ల కేవైసీ మాత్రమే పూర్తి చేయగలిగాయి. దీంతో దాదాపు 95 శాతం మొబైల్ వాలెట్లు మార్చి తర్వాత కార్యకలాపాలు నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
మొబైల్ వాలెట్ సంస్థలన్నీ కూడా కచ్చితంగా కేవైసీ ధ్రువీకరణ జరపాల్సిందేనంటూ 2017లో రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దీంతో వనరులున్న సంస్థలు ఆధార్ ఆధారంగా ఎలక్ట్రానిక్ రూపంలో కేవైసీ వెరిఫికేషన్ జరిపాయి. పేమెంట్స్ బ్యాంకింగ్ లైసెన్స్ కూడా పొందిన పేటీఎం.. బయోమెట్రిక్ డాంగిల్స్, ఫీల్డ్ ఏజెంట్లను ఉపయోగించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా తెరిచింది. ఈ విధంగా పేటీఎం తమ యూజర్లలో దాదాపు 70 శాతం మందికి పూర్తి స్థాయిలో కేవైసీ నిబంధనలు అమలు చేయగలిగినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. కానీ మిగతా కంపెనీలు నానాతంటాలు పడుతున్నాయి. ప్రాథమిక స్థాయి ధ్రువీకరణ మాత్రమే పూర్తి చేయగలిగామని, బయోమెట్రిక్స్ లేకపోవడంతో పూర్తి వెరిఫికేషన్ చేయలేకపోతున్నామని మరో వాలెట్ సంస్థ అధికారి వివరించారు. పేపర్ రూపంలో డాక్యుమెంట్స్‌ను సేకరించి, వెరిఫికేషన్ చేయాలంటే ఖర్చులు భారీగా పెరిగిపోయి, లాభదాయకత సమస్యలు ఉంటున్నాయని వాపోయారు. మరోవైపు, సుప్రీం తీర్పు కారణంగా ఇప్పటికే ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేసిన కస్టమర్ల డేటా అంతా కూడా మార్చి తర్వాత తమ సర్వర్ల నుంచి తొలగించనుండటంతో ఆయా యూజర్లు కూడా మళ్లీ ప్రత్యేకంగా ఇతరత్రా ధృవీకరణ పత్రాలతో కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం రావొచ్చని కూడా వాలెట్ సంస్థల వర్గాలు తెలిపాయి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం..
ప్రైవేట్ కంపెనీలు తమ కస్టమర్ల ధృవీకరణ కోసం ఆధార్ ఆధారిత ఎలక్ట్రానిక్ కేవైసీ వెరిఫికేషన్Œ (ఈకేవైసీ) ప్రక్రియను అమలు చేయడానికి లేదంటూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పునివ్వడంతో మొబైల్ వాలెట్ సంస్థలకు తాజా సమస్యలు వచ్చి పడ్డాయి. ’ఈకేవైసీ లేదు. సులభతరమైన ప్రత్యామ్నాయ కేవైసీ విధానాల గురించి ఆర్బీఐ ఇప్పటివరకూ ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదు. మరోవైపు, డెడ్‌లైన్ చూస్తే ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉంది. ప్రస్తుత స్థాయిని బట్టి చూస్తే.. ఆలోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు’ అని ఒక వాలెట్ సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలకు ఈ–కేవైసీ అందుబాటులో లేకపోవడంతో.. వీడియో ఆధారిత వెరిఫికేషన్, ఎక్స్ఎంఎల్ ఆధారిత కేవైసీ వంటి ప్రత్యామ్నాయ విధానాలనైనా అనుమతించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, వీటికి రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికారికంగా ఆమోదముద్ర లేదు.
పార్లమెంటు వైపు చూపు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ చట్ట సవరణకి పార్లమెంటు ఆమోదముద్ర వేస్తే కాస్తంత గట్టెక్కగలమని వాలెట్ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం కస్టమర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ని ఇచ్చేలా చట్ట సవరణ ప్రతిపాదనలు ఉన్నాయి. సౌకర్యంపరంగా.. కస్టమర్లు ఆధార్ వెరిఫికేషన్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అటు ఆర్బీఐ నుంచి కూడా కొంత భరోసా లభిస్తే గట్టెక్కుతామని అంటున్నాయి.
స్టాండెలోన్ వాలెట్లపైనే ప్రభావం ఎక్కువ..
దేశీయంగా నాలుగేళ్ల క్రితం పెద్దయెత్తున వాలెట్ కంపెనీలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. మొబిక్విక్, ఫోన్‌పే, అమెజాన్‌పే వంటి సంస్థలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లేదా టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవలు అందించే ఇతరత్రా ఫిన్‌టెక్ కార్యకలాపాల్లోకి మళ్లాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు మాత్రమే మనుగడ ఉండవచ్చని, స్టాండెలోన్ వాలెట్లపై మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావం పడగలదని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ వర్గాలు తెలిపాయి.