150 కి.మీ. పాదయాత్ర చేయాలి
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలందరూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు వారి వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ప్రధాని మోదీ కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అలాగే పార్టీ బలహీనంగా నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోదీ సూచించారు.
మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2, వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31లను పురస్కరించుకుని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోదీ తెలిపారు. పాదయాత్రలో ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం పట్ల అభిప్రాయాన్ని ఎంపీలు తెలుసుకోవాలని, అలాగే ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అడగాలని అన్నారు. యాత్రలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.