ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర
సాక్షి, హైదరాబాద్: బీహార్‌లో వాల్మీకి టైగర్ రిజర్వ్ (వీటీఆర్) ఫారెస్ట్‌లో మ్యానీటర్‌గా మారి, 10 మందిని పొట్టన పెట్టుకున్న రాయల్ బెంగాల్ టైగర్ శనివారం హతమైంది. ఈ ఆపరేషన్‌లో బీహార్‌కు చెందిన పోలీసు కమాండోలతో పాటు నగరంలోని రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్ సైతం కీలక పాత్ర పోషించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు అటవీ శాఖ సలహాదారుడిగా ఉన్న ఆయన ఇప్పటి వరకు 24 మ్యానీటర్లు, మదపుటేనుగుల్ని మట్టుపెట్టారు. కొన్ని మ్యానీటర్లకు సంబంధించిన ఆపరేషన్స్‌లో షఫత్ కుమారుడు అస్ఘర్ అలీ ఖాన్ సైతం కీలకంగా వ్యవహరించారు.
నవాబ్ షఫత్ అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తుపాకులు, గుర్రాల మధ్య పెరిగారు. ఆయన తాత బహదూర్ బ్రిటిష్–ఇండియాకు ఫారెస్ట్ అడ్వయిజర్‌గా వ్యవహరించారు. బ్రిటీష్ హయాంలో ఏనుగులతో ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో బహదూర్ 50 ఏనుగులు, 10 మానీటర్లను మట్టుపెట్టారు. 1976లో 19 ఏళ్ల వయస్సున్న అలీ ఖాన్ తొలి ‘తూటా’ పేల్చారు. కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని హెచ్డీ కోటలో 19 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగును హతమార్చారు. అలా మొదలైన ‘వేట’ ఇప్పటికీ కొనసాగుతోంది. షఫత్ అలీ ఖాన్ బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలకు అటవీ విభాగం అడ్వయిజర్‌గా పని వ్యవహరించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు కొనసాగుతున్నారు. ఆయా రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులకు శిక్షణ ఇచ్చి వస్తుంటారు. మ్యాన్–మానిమల్ కన్ఫ్లిక్ట్, తుపాకీ వినియోగాల్లో తరీ్ఫదు ఇవ్వడంతో ఈయనకు ప్రత్యేకత ఉంది. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి, మ్యానీటర్లు–మదపుటేనుగుల్ని మట్టుపెట్టే అలీ ఖాన్ పలుమార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నారు.
ఈ వేటగాడిలో జంతు ప్రేమికుడు దాగి ఉన్నాడు. అంతరించిపోతున్న పులుల సంతతిపై ‘ప్రాజెక్ట్ టు సేవ్ ది టైగర్’ పేరుతో అధ్యయనం చేస్తున్నారు. ‘ఆడపులి కేవలం 111 రోజులకే కాన్పు చేస్తుంది. ఒక కాన్పులో కనీసం 3 నుంచి 4 పిల్లలు పుడతాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 1970ల్లో 20 వేలున్న పులుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే దీనిపై అధ్యయనం చేస్తున్నా’ అన్నారాయన. పులులు అంతరించిపోకుండా కొన్ని పరిష్కారాలనూ చూపుతూ త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
ఇప్పటి వరకు షఫత్ అలీ ఖాన్ చేసిన ‘వేట’ల సంఖ్య 24కు చేరింది. వీటిలో 17 మ్యానీటర్లే కావడం గమనార్హం. 1976 నుంచి ‘వేటాడుతున్న’ ఈయన గతంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఏడు ఏనుగు లు, ఐదు పులులు, 14 చిరుతల్ని హతమార్చారు.
(చదవండి: కాశీ యాత్రకు ‘రైలు’ కష్టాలు!)