ఎస్‌సీ, బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలి
కర్నూలు(అర్బన్) : ‘ఎస్‌సీ కులంలో జన్మించాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ఎస్సీలను చులకన చేస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్‌సీ, బీసీలకు క్షమాపణ చెప్పాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాలని వీఆర్‌పీఎస్ నేతలు స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
సుభాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజల ఓట్ల కోసం ఆయా సామాజిక వర్గాలోని పలు కులాలకు అనేక హామీలను గుప్పించిన చంద్రబాబునాయుడు నేడు వాటిని నెరవేర్చలేక ఆయా కులాలను కించపరుస్తున్నారన్నారు. దశాబ్దాలుగా అనేక అట్టడుగు కులాలు సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, విద్య, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలని ఉద్యమాలు చేస్తుంటే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. వీఆర్‌పీఎస్ జిల్లా నాయకులు ఉల్చాల శివన్న, మహేష్, క్రిష్ణ, గోవర్దన్, ప్రతాప్, శివ పాల్గొన్నారు.