బీజేపీని విమర్శించే అర్హత టీడీపీకి లేదు
కొత్తపేట :
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ నైతిక విలువలను తుంగలో తొక్కిన టీడీపీకి బీజేపీని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ కిసాన్‌మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం అన్నారు. ఆయన ఆదివారం కొత్తపేటలో తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీని అతి పెద్ద పార్టీగా గుర్తించి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రంలో నరేంద్రమోదీ హవా, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రచారంతో టీడీపీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేపట్టిందనే విషయాన్ని ఎమ్మెల్యే గోరంట్ల గ్రహించాలన్నారు. బీజేపీ దేశ భవిష్యత్తును, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగిస్తుందన్నారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు అన్న సీఎం చంద్రబాబు నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా మాట్లాడటం ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకోవడం అభివృద్ధా అని ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని 2019లో ప్రజలు నిర్ణయిస్తారు. ముందు మీరు నైతిక విలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు, రాష్ట్రాభివృద్ధికి ప్రయత్నాలు చేయండి’ అని టీడీపీవారికి ఆయన హితవు పలికారు. 2014 ఎన్నికల్లో మీరిచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, నేటికీ ఆహామీలను నెరవేర్చకపోగా ప్రజలను తప్పుదోవ పట్టించి కేంద్రంపై నిందలు వేయడం సరికాదని హెచ్చరించారు. ఆయన వెంట మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి,ప్రధాన కార్యదర్శి పాలూరి జయప్రకాష్‌నారాయణ, కా>ర్యవర్గ సభ్యుడు బొరుసు జానకిరామయ్య, గ్రామ పార్టీ అద్యక్షుడు నేమాని రామకృష్ణ తదితరులు ఉన్నారు.