Vanamagan
-
సాయేషా కోరికేంటో తెలుసా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదగాలని ఆశపడుతున్న బాలీవుడ్ బామల్లో నటి సాయేషాసైగల్ ఒకరు. ప్రఖ్యాత సినీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ మొదట్లోనే దక్షిణాదిపై దృష్టిసారించింది. అలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సాయేషా ఇప్పుడు కోలీవుడ్‌కే ప్రాధాన్యతనిస్తానంటోంది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. నిజానికి సాయేషా నటించిన ఆ ఒక్క చిత్రమే ఇప్పటికి తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసిన జుంగా చిత్రం, ఆపై ఆర్యతో జత కట్టిన గజనీకాంత్ చిత్రం అంటూ వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలే ఉన్నాయి. జుంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సాయేషా నటనను, ఆమె సహకారాన్ని చిత్ర యూనిట్ తెగ మెచ్చేకున్నారు. సాయేషా కూడా జుంగా చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఒక భేటీలో తను పేర్కొంటూ తాను తమిళ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నానని చెప్పింది. అదే విధంగా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే తాను చిన్న వయసు నుంచే నాట్యంలో శిక్షణ పొందానని తెలిపింది. అందుకే సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ ఎంత కఠినంగా ఉన్నా సులభంగా చేసేస్తానని చెప్పింది. అదే విధంగా పూర్తి నృత్యభరిత కథా పాత్రలో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. ఉదాహరణకు తెలుగు చిత్రం మయూరి తరహాలో నాట్యానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలాంటిది చేయాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. ఈ సుందరి త్వరలో ముంబైలో డాన్స్ స్కూల్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటోంది. -
బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా..
తమిళసినిమా: కోలీవుడ్‌లో వర్ధమాన కథానాయికల కొరత కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ మూడు పదుల వయసు దాటిన నటీమణులు అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కొత్త నటీమణులు సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. దీంతో వర్ధమాన హీరోయిన్ల కొరత కోలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సినీ వర్గాలు. అదే విధంగా బాలీవుడ్ హీరోయిన్ల దాడి కొరవడిందనే చెప్పాలి. హన్సిక, తాప్సీ వంటి హీరోయిన్లను కోలీవుడ్ దాదాపు పక్కన పెట్టేసిందనే చెప్పవచ్చు. నటి హన్సిక చేతిలో ఒకే ఒక్క తమిళ చిత్రం ఉంది. ఇక నటి తాప్సీకి ఆ ఒక్క అవకాశం కూడా లేదు. ఇలాంటి సమయంలో ముంబై బ్యూటీ సాయేషా సైగల్ యువస్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడికి ఇంత వరకూ దక్షిణాదిలో సరైన సక్సెస్ పడలేదు. కోలీవుడ్, టాలీవుడ్లో ఒక్కో చిత్రంలోనే నటించింది. అయితే కోలీవుడ్‌లో జయంరవితో రొమాన్స్ చేసిన వనమగన్ చిత్రంలో సాయేషా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఆమెలో మంచి డాన్సర్ ఉందనే పేరు తెచ్చుకుంది. అంతే వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం కార్తీకి జంటగా కడకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జుంగా, ఆర్యతో గజనీకాంత్ చిత్రాల్లో నటిస్తోంది. ఆర్యకు జంటగా నటించిన గజనీకాంత్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఆ తరువాత వరుసగా కడకుట్టి సింగం, జుంగా చిత్రాలు తెరపైకి రానున్నాయి. ప్రస్తుతం మరి కొన్ని చిత్రాలు సాయేషా సైగల్ తలుపుతడుతున్నాయట. దీంతో బాలీవుడ్, టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నా నిరాకరిస్తూ కోలీవుడ్‌నే టార్గెట్‌గా పెట్టుకుని ఇక్కడ మంచి మార్కెట్‌ను సంపాదించుకోవాలని సాయేషా భావిస్తోందట. అలా యువ హీరోయిన్లు లేరనే విషయాన్ని తాను సద్వినియోగం చేసుకోవాలనే ప్లాన్‌లో ఈ ముద్దుగుమ్మ ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను!
బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దిగుమౖతైన అందాలభరిణి సాయేషాసైగల్. అందమొక్కటే కాదు చక్కని అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంకా చెప్పాలంటే ఆ సాయేషాలోని నాట్యకళాకారిణి ఆమెకు అదనపు క్వాలిపికేషన్గామారింది. తొలి చిత్రం వనమగన్ చిత్రంతోనే ప్రశంసలు అందుకుంటున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్ మనవరాలన్నది గమనార్హం. అంత పెద్ద నట వంశానికి చెందిన సాయేషా నటిగా తొలుత టాలీవుడ్లో కథానాయకిగా పరిచయం అవడం విశేషం. తరువాత కోలీవుడ్‌కు అడుగుపెట్టింది. ఇక్కడ వనమగన్ చేతిలో ఉండగానే కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో విశాల్, కార్తీలతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్న లక్కీ భామ సాయేషాతో చిన్న చిట్‌చాట్.. – తమిళసినిమా ♦ హిందీలో పెద్ద నట కుటుంబానికి చెందిన మీరు నటిగా దక్షిణాదిని ఎంచుకోవడానికి కారణం? నేను సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయినైనా సినిమా నన్ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదు. నేను ఇష్టపడే నటించడానికి వచ్చాను. దక్షిణాది ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను తొలుత తమిళ చిత్రంలోనే నటించాలని ఆశ పడ్డా.అయితే అందుకు సరైన అవకాశం రాలేదు. నేను నటించిన తెలుగు చిత్రం అఖిల్ చూసి దర్శకుడు విజయ్ కోలీవుడ్‌లో అవకాశం కల్పించారు. ♦ కోలీవుడ్‌లో మీ తొలి హీరో జయంరవి గురించి? తమిళ భాష తెలియదు.అయితే షూటింగ్ ష్పాట్లో జయంరవి, దర్శకుడు విజయ్ చాలా సహకరించారు. ప్రతి కొత్త హీరోయిన్‌కు జయంరవితో నటించే అవకాశం వస్తే అది వరమే అవుతుంది. ♦ వనమగన్ చిత్రంలో డాన్స్‌లో దుమ్మురేపారటగా? నాకు నటన కంటే నాట్యంపైనే మోహం అధికం. శాస్త్రీయ నాట్యం నుంచి పాశ్చాత్య నాట్యం వరకూ సంప్రదాయబద్దంగా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా సమయం లభిస్తే నాట్యంలో శిక్షణ పొందుతాను. ఒక వేళ నేను నటినవ్వకుంటే నాట్యకళాకారిణిని అయ్యేదాన్ని. ♦ ప్రభుదేవా దర్శకత్వంలో నటించడం గురించి? ప్రభుదేవా వనమగన్ చిత్రంలో ఒక పాటలో నాతో అద్భుతంగా డాన్స్ చేయించారు. ఒక డాన్సర్‌గా నేను ఆయకు వీరాభిమానిని. ప్రభుదేవా నటించిన ఏబీసీడీ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో.అలాంటిది నన్ను విశాల్, కార్తీ వంటి ప్రముఖ హీరోలతో నటింపజేస్తున్నారు. నాపైన ఆయన నమ్మకాన్ని వమ్ముకానీయను. ♦ మిమ్మల్ని నటి హన్సికతో పొల్చడం గురించి? ఇదే విషయాన్ని చాలా మంది నాతో అన్నారు. అయితే నన్ను ఎవరితోనూ పోల్చరాదన్నది నా భావన. నేను నేనుగానే ఉండాలనుకుంటున్నాను. ఇక సినిమాలో ఎవరూ ఎవరి స్థానాన్ని చేజిక్కించుకోలేరు. ఎవరి స్థానం వారికుంటుంది. నాకంటూ ఒక స్థానాన్ని తమిళ ప్రేక్షకులు కచ్చితంగా అందిస్తారన్న నమ్మకం నాకుంది. -
ఆ నమ్మకాన్ని వమ్ముకానీయను: సయేషా
చెన్నై: తెరంగేట్రం చేసిన టాలీవుడ్ మూవీ ‘అఖిల్’, బాలీవుడ్లో మొదటి సినిమా 'శివాయ్'లు ఆశించినమేర ఆడకపోవడంతో యువహీరోయిన్ సయేషా సైగల్ కెరీర్ డోలాయమానంలో పడినట్లైంది. అయితే, అంతటితో నిరుత్సాహపడక, తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే రెండు భారీ క్రేజీ సినిమాలకు సైన్ చేసింది. బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ కుటుంబానికి చెందిన అమ్మాయినే అయినా తమిళ సినిమా అంటే విపరీతమైన ఇష్టమని చెప్పుకొచ్చింది సయేషా. వాస్తవానికి మొదటి సినిమా తమిళంలోనే నటించాలని అనుకున్నా, ఆ అవకాశం రాకపోవడంతో టాలీవుడ్లో ‘అఖిల్’తో చేసినట్లు వివరించింది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్‌లు హీరోలుగా రూపొందుతున్న ‘కరుప్పు రాజా- వెళ్లై రాజా’ సినిమాలో సయేషా హీరోయిన్గా చేస్తోంది. అంతకుముందే ‘వనమగన్’లో జయం రవితో జోడీకట్టింది. ఇటీవల ‘కరుప్ప..’ షూటింగ్ గ్యాప్‌లో సయేషా మీడియాతో చిట్‌చాట్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ కుటుంబానికి చెందిన మీరు నటిగా దక్షిణాదిని ఎంచుకోవడానికి కారణం? నేను సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయినైనా సినిమాలు నన్ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయలేదు. పూర్తి ఇష్టంతోనే నటించడానికి వచ్చాను. దక్షిణాది ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నేను తొలుత తమిళ చిత్రంలోనే నటించాలని ఆశపడ్డా. కానీ అవకాశం రాలేదు. దీంతో అఖిల్‌తో చేయాల్సివచ్చింది. ఆ సినిమా చూసి దర్శకుడు విజయ్ కోలీవుడ్‌లో అవకాశం కల్పించారు. అలా నాకెంతో ఇష్టమైన తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తమిళంలో మీ తొలి హీరో జయం రవి గురించి? నాకు తమిళం రాదు. అయితే షూటింగ్ స్పాట్లో జయం రవి, దర్శకుడు విజయ్ చాలా సహకరించారు. ప్రతి కొత్త హీరోయిన్‌కు జయం రవితో నటించే అవకాశం వస్తే అది వరమే అవుతుంది. ‘వనమగన్’ చిత్రంలో డ్యాన్స్‌లో దుమ్మురేపారట? నాకు నటనకంటే నాట్యంపైనే మోహం ఎక్కువ. శాస్త్రీయ నాట్యం నుంచి పాశ్చాత్య నృత్యం దాకా అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా టైమ్ దొరికిదే డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటూఉంటా. ఒక వేళ నేను నటిని కాకుండా ఉండుంటే ఖచ్చితంగా నాట్యకళాకారిణిని అయ్యేదాన్ని. ప్రభుదేవా దర్శకత్వంలో నటించడం గురించి? తమిళంలో నా ఫస్ట్ మూవీ ‘వనమగన్’లో ఒక పాటలో ప్రభుదేవా నాతో అద్భుతంగా డ్యాన్స్ చేయించారు. ఒక డ్యాన్సర్‌గా నేను ఆయనకు వీరాభిమానిని. ప్రభుదేవా నటించిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. అలాంటాయన నన్ను హీరోయిన్గా పెట్టి విశాల్, కార్తీ లాంటి పెద్ద హీరోలతో సినిమా తీస్తుండటం నావరకైతే గ్రేట్. ప్రభుదేవా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయను. మిమ్మల్ని నటి హన్సికతో పోల్చడం గురించి? ఇదే విషయాన్ని చాలామంది నాతో అన్నారు. అయితే నన్ను ఎవరితోనూ పోల్చరాదన్నది నా భావన. నేను నేనుగానే ఉండాలనుకుంటున్నాను. ఇక సినిమాలో ఎవరూ ఎవరి స్థానాన్ని చేజిక్కించుకోలేరు. ఎవరి స్థానం వారికుంటుంది. నాకంటూ ఒక స్థానాన్ని తమిళ ప్రేక్షకులు కచ్చితంగా అందిస్తారన్న నమ్మకం ఉంది. (చదవండి: షోలే మాదిరి చేస్తానన్నారు) -
ఏదైనా డైరెక్ట్‌గానే..
ఏదైనా ఫేస్ టు ఫేస్ బెటర్ అంటోంది బాలీవుడ్ యువ నటి సయేషాసైగల్. బాలీవుడ్ బిగ్ సినీ వారసత్వం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెరంగేట్రం మాత్రం టాలీవుడ్లో చేయడం విశేషం అని చెప్పాలి. నటుడు నాగార్జున వారసుడు అఖిల్ కథానాయకుడిగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రంతో నాయకిగా పరిచయం అయిన సయేషా ఆ చిత్రంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌తో నటించిన శివాయ్ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడికి కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. తాజాగా జయంరవితో వనమగన్‌తో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ అదరగొట్టి ఆ పాటకు నృత్య దర్శకత్వం వహించిన ప్రభుదేవానే విస్మయ పరచిందట. ఇక చిత్ర దర్శకుడిని విపరీతంగా ఆకట్టుకున్న సైగల్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయట. వనమగన్ చిత్ర విడుదలకు ముందే కరుప్పురాజా వెళైరాజా వంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సయేషా మరి కొన్ని చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు కథ ఇప్పటి నుంచే మొదలైంది. సయేషా కాల్షీట్స్ ఇప్పిస్తానని, ఆమె మేనేజర్ తానేనంటూ కొందరు బురిడీ బాబులు పుట్టుకొచ్చారట. ఈ విషయం నటి సయేషా దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు చిత్రాల విషయం గాని, ఇతర కార్యక్రమ విషయాలు ఏవైనాగాని తనతో, తన తల్లితోగాని డైరెక్ట్‌గా చర్చించాలి. అంతే గాని తనకంటూ మేనేజర్ ఎవరూ లేరని తన ట్విట్టర్లో పేర్కొంది. -
నేను మంచోణ్ని కాను!
ఖచ్చితంగా నేను అంత మంచి వాడిని కాననిపించింది అని అన్నారు నటుడు జయంరవి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం వనమగన్. థింక్ బిగ్ స్డూడియోస్ పతాకంపై నిర్మాత ఏఎల్.అళగప్పన్ నిర్మిస్తున్న చిత్రం వనమగన్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయంరవి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయేషాసైగల్ కథా నాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తిరు ఛాయాగ్రహణం, హారీస్‌జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినిమాహాల్లో నిర్వహించారు. దర్శకుడు బాలా, లైకా ప్రొడక్షన్స్ రాజా మహాలింగం, నిర్మా త ఐసరి గణేశ్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత నా. ముత్తుకుమార్ కుమారుడు ఆదవన్ తొలి సీడీని అందుకున్నారు. ప్రకృతికి ప్రాధాన్యతనిచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరల్డ్ ఎర్త్‌డే రోజున జరగడం విశేషం. అదే విధంగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఛాయాగ్రాహకుడు తిరును ఈ వేదికపై సత్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ జయంరవి లేకపోతే ఈ వనమగన్ చిత్రం లేదన్నారు. అదే విధంగా మదరాసుపట్టణం చిత్రానికే హారీస్‌జయరాజ్ సంగీతం కోసం ప్రయత్నించానని, ఏడేళ్ల తరువాత ఈ చిత్రానికి ఆ ప్రయత్నం ఫలించిందని చెప్పారు. సాయేషా అంకితభావం కలిగిన నటి అని ప్రశంసించారు. సాయేషా మట్లాడుతూ వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో ఒక పాటకు డాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చిత్ర హీరో జయం రవి మాట్లాడుతూ తాను చాలా మంచి వాడినని అనుకునేవాడినని, దర్శకుడు విజయ్‌ని చూసిన తరువాత ఖచ్చితంగా తాను అంత మంచి వాడిని కాదనే భావన కలిగిందని అన్నారు. తాను వనబిడ్డను అయితే విజయ్ దైవబిడ్డ అని పేర్కొన్నారు. నటి సాయేషా చాలా బాగా నటించారన్నారు. సాయేషాను ఇప్పుడే బుక్ చేసుకోండి. తరువాత ఆమె కాల్షీట్స్ దొరకడం కష్టం అని అన్నారు. వనమగన్ చిత్రంలో తాను చాలా టఫ్ పాత్రను పోషించానని, తాను చేసే పనిలో బోర్ కొట్టకూడదనే వైవిధ్యభరిత పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని అందుకు సపోర్ట్‌గా నిలుస్తున్న దర్శకులకు, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు.