వండలూరు జూకు వర్దా దెబ్బ
►నేలకూలిన 10 వేల వృక్షాలు
► తాత్కాలికంగా మూసివేత
టీనగర్: వర్దా తుపాన్ తాకిడికి వండలూరు జూలో పదివేల చెట్లు నేలకొరిగాయి. దీంతో వండలూరు జూను పునరుద్ధరించేందుకు మరో వారం రోజులకు పైగా సమయం పట్టవచ్చని జూ అధికారులు తెలిపారు. దీంతో ఈ జూను తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్నారు. వర్దా తుపాన్ వండలూరు జూలో మునుపెన్నడూ లేని విధంగా భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీంతో ప్రస్తుతం సందర్శకులకు అనుమతి లభించడం లేదు. అక్కడ విరిగిపోయిన చెట్ల కొమ్మలను, నేల కూలిన వృక్షాలను తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
దీని గురించి వండలూరు జూ డిప్యూటీ డైరెక్టర్ షణ్ముగం విలేకరులతో మాట్లాడుతూ వర్దా తుపాన్ ముందు జాగ్రత్త చర్యగా జంతువులు, పక్షులను వాట సంరక్షణ కేంద్రాల్లో భద్రపరిచామని, దీంతో ఏ జంతువు తప్పించుకుని పారిపోలేదన్నారు. కొన్ని జంతువుల బోన్లపై చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయని ప్రస్తుతం వీటిని తొలగిం చే పనుల్లో ఉన్నామన్నారు. వండలూరు జూలో 10 వేలకు పైగా వృక్షాలు నేలకూలాయని, దీని సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నా రు. వృక్షాలు కూలడంతో ప్రహరీ గోడ దెబ్బతిందని, గోడ కూలడంతో ఒక మొసలి మాత్రం స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు.
తాత్కాలికంగా మూత: ప్రస్తుతం సందర్శకులను జూలోకి అనుమతించకుండా తాత్కాలికంగా మూసివేశారు. భద్రతా ఏర్పాట్లు ఖరారు చేసిన తర్వాతనే సందర్శకులకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.