Vansadhara Project
-
రీ సర్వేల పేరుతో కాలయూపన
రీ సర్వేల పేరుతో కాలయూపనకొత్తూరు: వంశధార ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి ఏళ్లు గడుస్తున్నా అధికారులు సర్వేలు, రీ సర్వేల పేరుతో పరిహారం అందజేయడానికి కాలయూపన చేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వంశధార నిర్వాసిత గ్రామం ఇరపాడులో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి పాలకొండ ఆర్డీఓ రెడ్డి గున్నయ్య, ఎస్డీసీ సల్మాన్‌రాజ్, తహశీల్దార్ డి.చంద్రశేఖర్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యూరు. సమావేశంలో నిర్వాసితులు సంజీవు, మురళి, తమ్మినాయడు, మడపాన భాస్కరరావు, లక్షణరావులతో పాటు పలువురు మాట్లాడుతూ నష్ట పరిహారంగా ఇళ్లు, చేతివృత్తులు, జిరాయితీ, డీ పట్టా భూములు వంటివి కల్పిస్తామని, ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం లేదని వాపోయారు. ఇంత వరకు ఇచ్చిన ప్యాకేజీల మొత్తం అధికారుల లంచాలకే సరిపోయాయి తప్ప తమ వద్ద రూపాయి కూడా లేదని ఎమ్మెల్యే, అధికారుల ముందు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. అధికారులకు లంచాలు ఇచ్చిన వారికి, దళారీలకు మాత్రమే ఇష్టాను సారం ఇళ్లు, నష్టపరిహారాలు, ప్యాకేజీలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అధికారుల హామీ నిర్వాసితులు తెలిపిన సమస్యలను విన్న అధికారులు స్పందిస్తూ తమ పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకొంటామని ఎమ్మెల్యే ముందు హమీ ఇచ్చారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సమస్యలు పరిష్కరించక పోతే పోరాటాలు తప్పవన్నారు. చట్టం పరిధిలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో చేతివాటం చేస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై నిర్వాసితుల నుంచి ఫిర్యాదులు తీసుకొని తగు చర్యలు తీసుకొన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. పోలవరం తరహా ప్యాకేటీ అమలు చేయూలి నిర్వాసిత పోరాట నాయకుడు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు పోలవరం తరహా ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 నిర్వాసితుల చట్టం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఇళ్ల నష్టపరిహారంలో అన్యాయూనికి గురైన నిర్వాసితుల ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, సర్పంచ్ ప్రతినిధి గంగరాపు సింహాచలం, నిర్వాసితుల నాయకులు పోర్న గోవిందరావు, మురళి, సంజీవు, సర్పంచ్ ఇల్లమ్మ, బూర్లె శ్రీనివాసరావు, తమ్మినాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి రవి, ఎం.భాస్కరావు, ఆర్ఐ భీమారావు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శితో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
అవినీతి డొంక కదిలింది!
శ్రీకాకుళం టౌన్ :శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి నిరంతరం సాగునీరందించే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరిట 2005లో వంశధార ప్రాజెక్టును రూ.వెయ్యి కోట్లతో మంజూరు చేశారు. వంశధార నదినుంచి కాట్రగడ వద్ద వరద నీటిని మళ్లించి హిరమండలం రిజర్వాయరు వరకు మూడంచెల రిజర్వాయర్లను నిర్మించాలని సంకల్పించారు. అయితే పదేళ్లు దాటినా ఈ ప్రాజెక్టు సంకల్పం నెరవేరలేదు. ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలైన తర్వాత భూసేకరణ మొదలు పరిహారం చెల్లింపులో కొందరు అధికారులు రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందులో హిరమండలం మండల సర్వేయర్‌గా పనిచేసిన రెడ్డి గవరయ్య (ప్రస్తుతం ఈయన పాతపట్నం మండల సర్వేయర్) ఒకరని అధికారులు ఎట్టకేలకు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ఆయన చేసిన తప్పేంటి? గవరయ్య వంశధార ప్రాజెక్టులో హిరమండలం మండల సర్వేయరుగా ఉన్న సమయంలో ఆ మండలంలోని 11 గ్రామాలకు సంబంధించిన సోషియో ఎకనమిక్ సర్వేలకు భిన్నంగా నివేదికలు తయారు చేసిన అధికారుల బృందంలో ఆయన ఒకరై పని చేశారని అభియోగం. సాధారణ జీవనం గడిపే స్థాయి నుంచి రూ.కోట్లకు పడగలెత్తిన ఆ బృందంలో ఆయనే ఒకరని జాయంట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ హిరమండలం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. లెక్కకు మించిన ఆస్తులు సంపాదించిన ఉద్యోగుల జాబితాలను తయారు చేశామని జేసీ చె బుతున్నారు. అందులో బాగంగానే ముందుగా ఈ నెల 23న ఆర్ఆర్ కాలనీలోని అతని ఇంటిని సోదా చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఏముంది? వంశధార ప్రాజెక్టు పరిధిలో రికార్డులను మాయం చేయడంతోపాటు డి-పట్టాలను తయారు చేసి వాటిపేరుతో అప్పటి తహశీల్దార్‌తో కలసి రూ.కోట్ల పరిహారం స్వాహా చేసినట్టు జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుతం పాతపట్నం సర్వేయరుగా పనిచేస్తున్న రెడ్డిగవరయ్య ఇంటిని ఈ నెల 23న సోదాలు జరిపిన జాయంట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అతనిపై పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసును నమోదు చేశారు. చొర్లంగి వద్ద ఆయన అతిథి గృహంలో కూడా సోదాలు నిర్వహించిన అనంతరం ఈ ఫిర్యాదు చేయడంతో పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ విచారణకు ఆదేశించారు. పాతపట్నం సీఐటీతోపాటు హిరమండలం ఎస్ఐ అతనిపై కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. దీంతో ఆయన పరారీలో ఉండడంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు కాకినాడ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ ఎంగోపాలరావు ఉత్తర్వుల్లో జారీ చేశారు. ఎవరీ గవరయ్య? జిల్లాలోని హిరమండలం మండలం కొల్లివలస నిర్వాసిత గ్రామానికి చెందిన రెడ్డిగవరయ్య 1993లో సొంత మండలంలోనే డిప్యూటీ సర్వేయరుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత సర్వేయర్‌గా 2005 నుంచి ఇక్కడే సర్వేయరుగా ఉన్న ఆయన వంశధార ప్రాజెక్టు మంజూరు కాగానే భూసేకరణలో కీలక భూమిక పోషించారు. గ్రామాల వారీగా సమగ్ర సర్వే బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఇక్కడున్న భూములపై సమగ్ర అవగహన ఉండడంతో కీలక వ్యక్తిగా మారాడని రెవెన్యూ, ల్యాండ్సర్వే ఉద్యోగులే చెబుతున్నారు. రెడీ అవుతున్న అవినీతి పరుల చిట్టా! వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కొనసాగుతుండడంతో భూసేకరణ, కట్టడాలకు పరిహారం, చెట్లకు పరిహారం, ప్యాకేజీల పరిహారం, డి-పట్టాలకు పరిహారం, అక్రమ కట్టడాలకు పరిహారం ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు దొరికినంత దోచుకున్నారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, సోషల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్, ల్యాండ్ అండ్ సర్వే, ఉద్యాన, అటవీశాఖలు వంశధార ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ అవినీతి చిట్టాలో భాగముందని విమర్శలున్నాయి. గ్రామాల వారీగా దళారులను అధికారులే తయారు చేసి రూ.వంద కోట్లు వరకు మింగేశారని కలెక్టర్ ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించారు. నివేదిక ఆధారంగా విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంటు విభాగానికి రహస్య విచారణ నిమిత్తం ప్రభుత్వం ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా సర్వేయరు రెడ్డి గవరయ్యపై దృష్టిసారించారు. మిగిలిన వారిలో ఎవరెవరిపై చర్యలుంటాయో వేచిచూడాలి. -
పనులు అరకొర... సాగేనా వంశధార?
నరసన్నపేట :వంశధార ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 1.48 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో శుక్రవారం ఉదయం 9.10 గంటలకు గొట్టాబ్యారేజి వద్ద కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తారు. గత సీజన్లో ఉన్నమేరకు సక్రమంగా అందించిన అధికారులు ఈ ఏడాదికూడా అదేరీతిలో అందివ్వగలరా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వంశధార నిర్వహణ డివిజన్ పరిధిలో వివిధ పనులకోసం రూ. ఏడుకోట్లతో ప్రతిపాదించగా అందులో 80శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంట్లో టెండర్పనులు అన్నీ చివరిదశకు వచ్చాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ నరసన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని ఓపెన్‌హెడ్ ఛానల్ పనులు మాత్రం 50 శాతమే పూర్తయ్యాయి. దీనివల్ల శివారు రైతులు తమవరకూ నీరొస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఏటా వారికి కష్టాలే... వంశధార ప్రాజెక్టు పరిధిలోని శివారు భూములకు ఏటా సాగునీరు సమస్యగానే ఉంటోంది. పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, నందిగాం తదితర మండలాల రైతులు సాగు నీటి కోసం ఏటా అవస్థలు పడుతున్నారు. అలాగే నరసన్నపేట, పోలాకి మండలాల్లో కూడా శివారు రైతులు కూడా సాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజనులో ఆ పరిస్థితి రాదని అధికారులు అంటున్నా రైతులు మాత్రం అనుమానిస్తున్నారు. పలుచోట్ల షట్టర్ల మరమ్మతులు చేయలేదని, పలు చానల్స్‌లో పూడిక తీయలేదని రైతులు అంటున్నారు. అలాగే వంశధార చానల్స్‌లో కూడా పనులు ఆశించిన మేరకు జరగలేదని వారు చెబుతున్నారు. అలాంటపుడు నీరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పోలాకి, మబగాం ఓపెన్ హెడ్ చానల్స్ పనులు పూర్తి కానేలేదు. వంశధార నది నుంచి జాతీయ రహదారి వరకూ పనులు నిర్వహించారు. మిగిలిన బాగం పనులు చేయక పోతే నీరు పోలాల్లోకి ఎలా వస్తుందని రైతులు అనుమానిస్తున్నారు. అధ్వానంగా షట్టర్సు వంశధార చానల్స్‌తో పాటు ఓపెన్ హెడ్ చానల్స్‌లో ఉన్న ఫట్టర్సు అధ్వానంగా ఉన్నాయి. షట్టర్సు కుంభకోణం వ్యవహారం కొలిక్కి రాక పోవడంతో వాటి మరమ్మతు పనులు నిర్వహించడం లేదు. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు తేలితే తప్ప పనులు చేయలేమని అధికారులు తేల్చేస్తున్నారు. అయితే వంశధార ఇంజనీర్లు మాత్రం నీటి రెగ్యులేషన్‌కు ఇబ్బంది లేకుండా షట్టర్ల మరమ్మతు చేస్తున్నామని అంటున్నారు. అనుకూలంగా ఇన్‌ఫ్లో.. శుక్రవారం నీటి విడుదలకు వంశధారలో ఇన్‌ఫ్లో అనుకూలంగా ఉంది. రెండు రోజుల క్రితం వరకూ నీటి ఇన్‌ఫ్లో తక్కువగా ఉండగా గురువారం సాయంత్రానికి 1950 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. గొట్టాబ్యారేజి వద్ద నీటి నిల్వ కూడా అనుకూలంగా ఉందని చెబుతున్నారు. -
ఖరీఫ్‌కు వంశ‘ధార’
సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించినట్టు చెప్పారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్-2, ఫేజ్- 2 హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, మండలాల్లో 20 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా, 14 గ్రామాలను ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని వివరించారు. నిర్వాసిత గ్రామాల్లో నివసిస్తున్న 7,104 కుటుంబాకు సంబంధించి సామాజిక, ఆర్థిక సర్వేల ద్వారా వివరాలు సేకరించామన్నారు. ఈ కుటుంబాలకు రూ. 47.33 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. పునరావాస పునఃపరిశీలన స్కీం 2005 ప్రకారం ఆ మండలాల్లో ఇళ్ల సర్వేలు చేపట్టామన్నారు. వారిలో 700 కుటుంబాలకు గాజుల కొల్లివలస, 150 కుటుంబాలకు వెన్నెలవలసలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మూడు మండలాల్లోని 19 గ్రామాల్లో వివిధ పునరావాసాల కింద 24.69 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఇంకా 1779 ఇళ్ల నిర్మాణాలకు సహాయం అందజేయాల్సి ఉందని, నిర్వాసితులు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు అందజేయాల్సి ఉందన్నారు. వీరికి సంబంధించిన వివరాలు సేకరించాలని తహశీల్దార్లను ఆదేశించినట్టు చెప్పారు. -
ఆ డ్యాం పూర్తి అయితే.. 5 మండలాలు ఎడారే!
పాతపట్నం : వంశధార ప్రాజెక్టు విషయంలో నానాయాగీ చేస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహేంద్రతనయ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్ట వల్ల దిగువనున్న శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు తాగు, సాగు నీరు అందకుండాపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యాం నిర్మాణాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, లేనిపక్షంలో జిల్లాలోని ఐదు మండలాలకు ముప్పు ఏర్పడుతుందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశాలోని గజపతి జిల్లా డంబాపూర్ వద్ద మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న ఈ భారీ కట్టడాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. డ్యాం వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రూ.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన డంబాపూర్ డ్యాం పనులు గత మూడేళ్లుగా జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణాన్ని అడ్డుకోకపోతే వేలాది రైతులు, ప్రజల జీవితాలు ఎడారిగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్యాం నిర్మాణం పూర్తయితే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, నందిగాం, పలాస మండలాలకు చెందిన పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని వివరించారు. అలాగే మెళియాపుట్టి మండలంలో సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు చుక్కనీరైనా అందకుండాపోతుందన్నారు. మహేంద్రతనయ నదిపై మెళియాపుట్టి మండలంలో రెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయని, అవి కూడా నీరందక వట్టిపోతాయని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న నదిపై ఎగువ భాగంలో మన రాష్ట్ర ప్రమేయం లేకుండానే ప్రాజెక్టులు నిర్మించుకుంటేపోతే, మనకు రావలసిన నీటి వాటా పరిస్థితి ఏమిటని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించారు. తక్షణమే ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితోపాటు జిల్లా మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఒడిశాతోపాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్మాణ పనులు నిలిపివేసేందకు చర్యలు తీసుకోవాలని కోరారు.