రీ సర్వేల పేరుతో కాలయూపన | Vansadhara Project Re Surveys | Sakshi
Sakshi News home page

రీ సర్వేల పేరుతో కాలయూపన

Published Wed, Jan 27 2016 11:53 PM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

Vansadhara Project Re Surveys

 రీ సర్వేల పేరుతో కాలయూపనకొత్తూరు: వంశధార ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి ఏళ్లు గడుస్తున్నా అధికారులు సర్వేలు, రీ సర్వేల పేరుతో పరిహారం అందజేయడానికి కాలయూపన చేస్తున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వంశధార నిర్వాసిత గ్రామం ఇరపాడులో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి పాలకొండ ఆర్‌డీఓ రెడ్డి గున్నయ్య, ఎస్‌డీసీ సల్మాన్‌రాజ్, తహశీల్దార్ డి.చంద్రశేఖర్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యూరు.
 
  సమావేశంలో నిర్వాసితులు సంజీవు, మురళి, తమ్మినాయడు, మడపాన భాస్కరరావు, లక్షణరావులతో పాటు పలువురు మాట్లాడుతూ నష్ట పరిహారంగా ఇళ్లు, చేతివృత్తులు, జిరాయితీ, డీ పట్టా భూములు వంటివి కల్పిస్తామని, ఆర్‌ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం లేదని వాపోయారు. ఇంత వరకు ఇచ్చిన ప్యాకేజీల మొత్తం అధికారుల లంచాలకే సరిపోయాయి తప్ప తమ వద్ద రూపాయి కూడా లేదని ఎమ్మెల్యే, అధికారుల ముందు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. అధికారులకు లంచాలు ఇచ్చిన వారికి, దళారీలకు మాత్రమే ఇష్టాను సారం ఇళ్లు, నష్టపరిహారాలు, ప్యాకేజీలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
 
 అధికారుల హామీ
 నిర్వాసితులు తెలిపిన సమస్యలను విన్న అధికారులు స్పందిస్తూ తమ పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకొంటామని ఎమ్మెల్యే ముందు హమీ ఇచ్చారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సమస్యలు పరిష్కరించక పోతే పోరాటాలు తప్పవన్నారు. చట్టం పరిధిలో ఉన్న సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో చేతివాటం చేస్తున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై నిర్వాసితుల నుంచి ఫిర్యాదులు తీసుకొని తగు చర్యలు తీసుకొన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.
 
 పోలవరం తరహా ప్యాకేటీ అమలు చేయూలి
 నిర్వాసిత పోరాట నాయకుడు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు పోలవరం తరహా ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2013 నిర్వాసితుల చట్టం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు.
 
 ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే
 ఇళ్ల నష్టపరిహారంలో అన్యాయూనికి గురైన నిర్వాసితుల ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరిక రాజేశ్వరి, సర్పంచ్ ప్రతినిధి గంగరాపు సింహాచలం, నిర్వాసితుల నాయకులు పోర్న గోవిందరావు, మురళి, సంజీవు, సర్పంచ్ ఇల్లమ్మ, బూర్లె శ్రీనివాసరావు, తమ్మినాయుడు, జెడ్‌పీటీసీ ప్రతినిధి రవి, ఎం.భాస్కరావు, ఆర్‌ఐ భీమారావు, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శితో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement