శ్రీకాకుళం టౌన్ :శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి నిరంతరం సాగునీరందించే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరిట 2005లో వంశధార ప్రాజెక్టును రూ.వెయ్యి కోట్లతో మంజూరు చేశారు. వంశధార నదినుంచి కాట్రగడ వద్ద వరద నీటిని మళ్లించి హిరమండలం రిజర్వాయరు వరకు మూడంచెల రిజర్వాయర్లను నిర్మించాలని సంకల్పించారు. అయితే పదేళ్లు దాటినా ఈ ప్రాజెక్టు సంకల్పం నెరవేరలేదు. ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలైన తర్వాత భూసేకరణ మొదలు పరిహారం చెల్లింపులో కొందరు అధికారులు రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందులో హిరమండలం మండల సర్వేయర్‌గా పనిచేసిన రెడ్డి గవరయ్య (ప్రస్తుతం ఈయన పాతపట్నం మండల సర్వేయర్) ఒకరని అధికారులు ఎట్టకేలకు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు.
ఆయన చేసిన తప్పేంటి?
గవరయ్య వంశధార ప్రాజెక్టులో హిరమండలం మండల సర్వేయరుగా ఉన్న సమయంలో ఆ మండలంలోని 11 గ్రామాలకు సంబంధించిన సోషియో ఎకనమిక్ సర్వేలకు భిన్నంగా నివేదికలు తయారు చేసిన అధికారుల బృందంలో ఆయన ఒకరై పని చేశారని అభియోగం. సాధారణ జీవనం గడిపే స్థాయి నుంచి రూ.కోట్లకు పడగలెత్తిన ఆ బృందంలో ఆయనే ఒకరని జాయంట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ హిరమండలం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. లెక్కకు మించిన ఆస్తులు సంపాదించిన ఉద్యోగుల జాబితాలను తయారు చేశామని జేసీ చె బుతున్నారు. అందులో బాగంగానే ముందుగా ఈ నెల 23న ఆర్‌ఆర్ కాలనీలోని అతని ఇంటిని సోదా చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు.
సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఏముంది?
వంశధార ప్రాజెక్టు పరిధిలో రికార్డులను మాయం చేయడంతోపాటు డి-పట్టాలను తయారు చేసి వాటిపేరుతో అప్పటి తహశీల్దార్‌తో కలసి రూ.కోట్ల పరిహారం స్వాహా చేసినట్టు జిల్లా కలెక్టర్ గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుతం పాతపట్నం సర్వేయరుగా పనిచేస్తున్న రెడ్డిగవరయ్య ఇంటిని ఈ నెల 23న సోదాలు జరిపిన జాయంట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అతనిపై పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసును నమోదు చేశారు. చొర్లంగి వద్ద ఆయన అతిథి గృహంలో కూడా సోదాలు నిర్వహించిన అనంతరం ఈ ఫిర్యాదు చేయడంతో పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ విచారణకు ఆదేశించారు. పాతపట్నం సీఐటీతోపాటు హిరమండలం ఎస్‌ఐ అతనిపై కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. దీంతో ఆయన పరారీలో ఉండడంతో వారిచ్చిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు కాకినాడ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ ఎంగోపాలరావు ఉత్తర్వుల్లో జారీ చేశారు.
ఎవరీ గవరయ్య?
జిల్లాలోని హిరమండలం మండలం కొల్లివలస నిర్వాసిత గ్రామానికి చెందిన రెడ్డిగవరయ్య 1993లో సొంత మండలంలోనే డిప్యూటీ సర్వేయరుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత సర్వేయర్‌గా 2005 నుంచి ఇక్కడే సర్వేయరుగా ఉన్న ఆయన వంశధార ప్రాజెక్టు మంజూరు కాగానే భూసేకరణలో కీలక భూమిక పోషించారు. గ్రామాల వారీగా సమగ్ర సర్వే బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఇక్కడున్న భూములపై సమగ్ర అవగహన ఉండడంతో కీలక వ్యక్తిగా మారాడని రెవెన్యూ, ల్యాండ్‌సర్వే ఉద్యోగులే చెబుతున్నారు.
రెడీ అవుతున్న అవినీతి పరుల చిట్టా!
వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కొనసాగుతుండడంతో భూసేకరణ, కట్టడాలకు పరిహారం, చెట్లకు పరిహారం, ప్యాకేజీల పరిహారం, డి-పట్టాలకు పరిహారం, అక్రమ కట్టడాలకు పరిహారం ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు దొరికినంత దోచుకున్నారు. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, సోషల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్, ల్యాండ్ అండ్ సర్వే, ఉద్యాన, అటవీశాఖలు వంశధార ఇంజినీరింగ్ విభాగం అధికారులకు ఈ అవినీతి చిట్టాలో భాగముందని విమర్శలున్నాయి. గ్రామాల వారీగా దళారులను అధికారులే తయారు చేసి రూ.వంద కోట్లు వరకు మింగేశారని కలెక్టర్ ప్రభుత్వానికి ఓ నివేదికను పంపించారు. నివేదిక ఆధారంగా విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగానికి రహస్య విచారణ నిమిత్తం ప్రభుత్వం ఆదేశించింది. విచారణ నివేదిక ఆధారంగా సర్వేయరు రెడ్డి గవరయ్యపై దృష్టిసారించారు. మిగిలిన వారిలో ఎవరెవరిపై చర్యలుంటాయో వేచిచూడాలి.
అవినీతి డొంక కదిలింది!
Published Wed, Jan 27 2016 11:50 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement