వరక్ మెరుపు
టక్కుం... టక్కుం... టక్కుం... అంటూ పాతనగరం షాలిబండ దారిలో లయబద్ధంగా శబ్దం వినిపించటాన్ని గమనించారా? తదేక దృష్టితో కొందరు కార్మికులు సుత్తులతో చిన్న తోలు సంచిపై కొడుతుంటే వచ్చే శబ్దాలివి. అలా గంటల తరబడి వారి శ్రమ కొనసాగుతుంది. ఆ శబ్దాల వెనక పెద్ద చారిత్రక నేపథ్యమే ఉంది. నిర్మాణాలు, రుచులు, కళలు... అన్నింటా ఆర్భాటం, ప్రత్యేకత ఉండాలనే తత్వం కుతుబ్షాహీలది. కిళ్లీ అంటేనే ప్రత్యేకం... దాని రూపులో ఆర్భాటం లేకుంటే ఏం బాగుంటుందనుకున్న పాదుషాలు దానికి ‘మెరుపు’ అద్దారు. అదే ‘వరక్’. దాన్ని తయారు చేసేప్పుడు వచ్చేదే ఆ శబ్దం.
భాగ్యనగరం అనగానే రాచరిక ఠీవీ ఒకలబోసే రాజప్రాసాదాల నిర్మాణం.. వాటిల్లో హొయలుబోయే విదేశీ నిర్మాణ కౌశలం.. షాహీ దస్తర్‌ఖానాలో కొత్త రుచుల భోజనం.. గానాభజానాలతో ఖుషీ.. సంగీత నృత్య కార్యక్రమాలను తిలకిస్తూ కిళ్లీని ఆస్వాదించటం.. కళ్లముందు కదలాడే నాటి దృశ్యాలివి. కిళ్లీకి బంగారు పూత అద్దటం ఆ ఆడంబరాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
ఇలా వన్నెలద్దే సంప్రదాయమే వరక్ కళ. అది దేశంలో తొలుత లక్నోలో ప్రారంభమైంది. ఆదిలో దీన్ని యునానీ మందుల్లో వినియోగించటం ప్రారంభించారు. వెండి, బంగారాల్లో ఔషధ గుణాలుండటమే దీనికి కారణం. ఆ తర్వాత మిఠాయిలు, కిళ్లీల వాడకం మొదలైంది. తమలపాకు కిళ్లీ చుట్టాక దానిపైన వెండి, బంగారు పూతలనద్దటం రాచరిక దర్పానికి గుర్తుగా భావించేవారు.
తొలి నాళ్లలో ఉన్నత కుటుంబాలకే పరిమితమైన ఈ సంప్రదాయం క్రమంగా ఇతర లోగిళ్లకూ పాకింది. వాడకం పెరిగే సరికి వాటి తయారీ కూడా విస్త్రృతమైంది. లక్నోలో ప్రారంభమైన ఈ పద్ధతి ఆ తర్వాత వారణాసి, జైపూర్, హైదరాబాద్‌లకు సోకింది. ఇప్పటికీ ఈ నగరాల్లో వరక్ తయారీ ఓ కుటుంబ పరిశ్రమ. నగరంలో కేవలం చార్మినార్- షాలిబండ దారిలో మాత్రమే దర్శనమిస్తుంది.
ఇదీ విధానం...
యంత్రాల ప్రమేయం లేని కళాత్మక ప్రక్రియ వరక్. మిఠాయిలు, పాన్లు కొన్నప్పుడు వాటిపై కనిపించే తెల్లటి పూతను నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది అది ఎంత నాజూకుగా ఉంటుందో. పూత రేకులోని పొరకంటే సన్నగా ఉంటుంది. వెండి, బంగారాన్ని అంత పలచగా తయారు చేయటం సాధారణ విషయం కాదు. పూర్తిగా చేతి తయారీ కావటం విశేషం. అర్ధ రూపాయంత నమూనాలో ముందుగా ముడిసరుకును సిద్ధం చేస్తారు.
అది పలచటి రేకులాగా ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా రూపొందించిన తోలు సంచిలో ఉంచుతారు. పుస్తకంలో కాగితాల మాదిరిగా ఆ సంచీలో 250 వరకు తోలు కమ్మలు ఉంటాయి. ఒక్కో కమ్మ కింద ఒక్కో వెండి బిళ్లనుంచి సుత్తిలాంటి పనిముట్టుతో ఏకంగా మూడు గంటల సేపు కొడుతూ పోతారు. ఆ దెబ్బలకు వెండి/బంగారు బిళ్లలు బాగా సాగి అతి పలచటి పొరల్లాగా తయారవుతాయి. వీటిని జాగ్రత్తగా తీసి పుస్తకాల్లోని కాగితాల మధ్య భద్రపరుస్తారు. 10 గ్రాముల వెండి/బంగారం నుంచి 160-175 పొరలు తయారవుతాయి. వీటిని మిఠాయిలు, కిళ్లీలు, కబాబ్స్‌లో అలంకరణగా వాడతారు.
విమర్శలు తప్పలేదు...
ఈ పొరల తయారీపై కొంత కాలంగా విమర్శలు చుట్టుముట్టాయి. తయారీ క్రమంలో ఆ పొరలు చిరిగిపోకుండా ఉండేందుకు తయారీదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం తోలు సంచీలోని ఆకుల మధ్య జంతువుల పేగులతో తయారైన లీవ్స్ (ఇవి మెత్తగా, దృఢంగా ఉంటాయి)ను వాడుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. వీటి మధ్యలో వెండి రేకులుంచి సుత్తితో కొడుతూ ఉండటం వల్ల ఆ పొరలు చిరిగిపోకుండా చాలా పలచగా సాగుతాయి. ఇదే క్రమంలో పేగులతో తయారైన లీవ్స్ నుంచి మాంసపు ముక్కలు వెండి రేకులకు అతుక్కుంటున్నాయని, వాటిని అలాగే స్వీట్లు, కిళ్లీలకు అద్ది అమ్ముతున్నారని వారు విమర్శిస్తున్నారు.
- గౌరీభట్ల నర్సింహమూర్తి