వృషభ వాహనంపై ఏకదంతుడి విహరం
కాణిపాకం(ఐరాల):
కాణిపాకంలో వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోlరోజైన శనివారం స్వామి వారు వృషభ వాహనంపై పురవీధుల్లో ఊరేగగా భక్తులు స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించారు. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారికి వృషభ వాహనసేవ జరిగింది. శనివారం ఉదయం కాణిపాకానికి చెందిన ఆర్యవైశ్యులు స్వామి వారి మూల విగ్రహనికి సంప్రదాయబద్ధంగా పంచామృతాది అభిషేకాలతో పూజాకార్యక్రమాలు నిర్వహించి మూలవిగ్రహనికి విశేషాలంకరణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ దూపదీప నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. వృషభ వాహన సేవకు కాణిపాకం ఆర్యవైశ్యులు సంతపల్లె, మారేడుపల్లె, ముదిగోళం, చిత్తూరు కాణిపాకం గ్రామాలకు చెందిన శాలివాహన వంశస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రికి సిద్ధి బుద్ది సమేతుడైన వరసిద్ధి వినాయక స్వామి వారికి విశేషాలంకరణ చేసి ఆలయ ప్రాకారమండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులను పల్లకిపై ఉభయదారులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు తీసుకువచ్చి వృషభవాహనంపై అధిష్టింప చేశారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు, కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఈఓ పూర్ణచంద్రారావు, ఏసీ వెంకటేషు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్రబాబు, స్వాములు, ఇన్ స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లికార్జున పలువురు సిబ్బంది పాల్గొన్నారు.