వణికిస్తున్న ‘వార్దా’
తెనాలి : వార్దా తుపాను కదలికలు డెల్టా గుండెల్లో భీతిని కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడి దిశ మార్చుకుంటూ వస్తున్న తీవ్ర తుపాను.. కోస్తా తీరానికి వచ్చేటప్పటికి బలహీనపడి వాయుగుండంగా లేదా తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు అందుతున్నాయి. కోస్తా తీరమంతా ఇప్పటికే రేవుల్లో రెండో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు దాదాపుగా తిరిగొచ్చేశారు. తీర గ్రామాల్లో సహాయక చర్యలపై అధికార యంత్రాంగం సన్నాహాల్లో ఉంది. ఈ పరిణామాల్లో జిల్లాలోని రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. పంటలకు కచ్చితంగా నష్టం జరుగుతుందని ముందే స్పష్టమవుతున్న హెచ్చరికలతో అది ఏ మేరకనేది ఎదురుచూడాల్సిన గందరగోళ పరిస్థితి అన్నదాతలది.
వరి రైతుల్లో వణుకు...
మచిలీపట్నం–నెల్లూరు మధ్య సోమవారం రాత్రి తీరం దాటే తుపాను ప్రభావం 24 గంటలు ముందునుంచే ఉంటుందనేది తెలిసిందే. దీనివల్ల ఆదివారం గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలకు అవకాశం ఉంది. మరుసటిరోజుకు ఈ ప్రభావం మరింతగా పెరిగి గంటకు 60–80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు రైతులకు వణుకు తెప్పిస్తున్నాయి. జిల్లాలోని మాగాణి భూముల్లో ప్రధానమైన వరి పైరు ఇప్పుడు కీలక దశలో ఉన్నందునే ఈ ఆందోళనంతా. వర్షాభావం, జలాశయాల్లో నీటి కొరతతో ఖరీఫ్ సీజను ఆలస్యంగా ప్రారంభమైంది. ఫలితంగా జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 4.10 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇందులో అత్యధిక విస్తీర్ణం పశ్చిమ డెల్టా పరిధిలోని తెనాలి డివిజనులోనే ఉంది. అన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎకరాకు సగటున 30–32 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఖర్చులు అధికమైనా తిండిగింజలకు ఎంతోకొంత ఆదాయం వస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు.
ఓదెలపై వరిపైరు... అన్నదాత గుండెల్లో బేజారు..
ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. దీంతో యంత్రంతో ఒకేరోజు కోత, నూర్పిడి చేసేసి ధాన్యం తీసుకునేందుకు వీల్లేకపోయింది. ఎక్కువమంది రైతులు కోతలు కోసి వరికుప్పలు వేయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరిపైరు కోతలు పూర్తయ్యాయి. ఇందులో 1.25 లక్షల ఎకరాల్లోనే కోత కోసిన పైరును కుప్పలు వేయగలిగినట్టు వ్యవసాయాధికారులు వెల్లడించారు. మిగిలిన 1.25 లక్షల ఎకరాల్లో పైరు ఓదెలపై ఉంది. తగిన సమయం ఓదెలు (పనలు) ఆరకుండా ఇప్పటికిప్పుడు కుప్పలు వేసుకొనే అవకాశం లేదు. భారీ వర్షాలు కురిస్తే కచ్చితంగా ఓదెలపై ఉన్న పైరు దెబ్బతింటుంది. మిగిలిన 1.60 లక్షల ఎకరాల్లో పైరులో సగం అంటే దాదాపు 80 వేల ఎకరాల్లో వరి పైరును నాలుగు రోజుల్లో కోత కోయాల్సి ఉంది. ఏపుగా ఉన్న వరి కంకులతో ఉన్న పైరు ఏమాత్రం వర్షం, గాలుల తాకిడి తగిలినా నేలకు కరుచుకుంటుందని తెలిసిందే. ఈ స్థితిలో తుపాను ప్రభావంతో గాలులు, భారీ వర్షాలు రానుండటం, పంట నష్టం జరిగే ప్రమాదం స్పష్టమవుతోంది. గతేడాది తీవ్రమైన వర్షాభావంతో రైతులు అల్లాడిపోయారు. వరిసాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయి, పంట దిగుబడి కూడా ఎకరాకు 20–22 బస్తాలకు పరిమితమైంది. ఈ ఏడాది ఏదోలా గట్టున పడతామనుకున్న అన్నదాతలకు ముంచుకొస్తున్న తుపాను తీవ్రత దిక్కుతోచకుండా చేస్తోంది. ఓదెలపై ఉన్న పైరు, నాలుగైదు రోజుల్లో కోత కోయాల్సిన చేలపై ఈ ప్రభావం భారీగా ఉంటుందనటంలో సందేహం లేదు.
మెట్ట పంటలకూ తప్పని ముప్పు...
జిల్లాలో వరి తర్వాత ప్రధానంగా సాగుచేసే పంటల్లో పత్తి, మిర్చి, పసుపు పైర్లు వర్షాలతో దెబ్బతినే ప్రమాదముంది. మిర్చి పైరు మూడో కోతలో ఉంది. మార్కెట్« ధర బాగుంది. క్వింటాలు రూ.12 వేలు పలుకుతోంది. పత్తి పైరు జిల్లాలో సగం విస్తీర్ణంలో చేతికొచ్చింది. మిగిలిన చేలల్లో ఇప్పుడు పత్తి తీయాల్సిన తరుణం. మద్దతు ధర రూ.4050కి మించి మార్కెట్ ధర రూ.4600–5000 వరకు పలుకుతోంది. వర్షాలు కురిస్తే భారీ నష్టం అనివార్యం. అదేరీతిలో భారీ వర్షాలతో పసుపు చేలకు నష్టం వాటిల్లుతుంది. చేలల్లో చేరిన నీటితో పంట దుంపకుళ్లు బారిన పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.