మైసూరు సమీపంలో మదపుటేనుగులు
= సకాలంలో స్పందించిన అధికారులు
= అటవీ ప్రాంతంలోకి తరిమివేత
= సంఘటనపై అసహనం వ్యక్తం చేసిన సీఎం
మైసూరు, న్యూస్‌లైన్ : నగర శివారు ప్రాంతంలోకి అడవి ఏనుగులు ప్రవేశించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెండేళ్ల క్రితం అటవీ ప్రాంతంలో నుంచి నగరంలోకి ప్రవేశించిన ఓ ఏనుగు దారుణంగా ఓ వ్యక్తిని హతమార్చిన వైనాన్ని రాచనగరి వాసులు ఇంకా మరవలేదు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు మైసూరు శివారులోని తడూరు వద్ద ఉన్న ప్రైవేట్ చిత్ర వర్ణ రిసార్ట్ వెనుక ఎనిమిది అడవి ఏనుగులు విడిది చేశాయి. వాటిని గమనించిన స్థానికులు ఉరుకులు పరుగులతో గ్రామంలోకి చేరుకున్నారు.
అనంతరం ఆ ఏనుగులు రింగ్ రోడ్డు వైపు వెళ్లాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో అప్రమత్తమయ్యారు. మైసూరుకు అత్యంత సమీపంలో చేరుకున్న ఏనుగులను గుర్తించి, వాటిని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు నానాకష్టాలు పడ్డారు. ఏసీఎఫ్ బసవరాజు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు విశేషంగా శ్రమించారు. కాగా, మైసూరుకు అత్యంత సమీపంలో అడవి ఏనుగుల గుంపు రావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు.
జిల్లాలోని టీ నరసిపురలో ఉన్న తలకాడులో పంచలింగ దర్శనం వేడుకలను ప్రారంభించిన ఆయనకు ఏనుగుల సంచారంపై అధికారులు తెలియజేశారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ జనవాసాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించి ప్రజల ప్రాణాలు తీస్తున్నా అధికారుల మొద్ద నిద్ర వీడడం లేదంటూ మండిపడ్డారు. విషయంపై వెంటనే అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి మరింత సమాచారాన్ని రాబట్టుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.