పీహెచ్డీ ఉంటేనే అసిస్టెంటు ప్రొఫెసర్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగంలో ప్రమాణాల పెంపులో భాగంగా యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హతగా పీహెచ్డీని తప్పనిసరి చేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని నిబంధనలపై కేంద్రం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దృష్టి సారిస్తున్నాయి. కనీస అర్హతగా పీహెచ్డీ ఉండేలా 2018లోనే యూజీసీ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడంలో ఆలస్యమవుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు పలువురు కోవిడ్ వల్ల తమ కోర్సులు పూర్తికానందున కొంత సమయం కావాలని విన్నవించారు. దీంతో పీహెచ్డీ కనీస అర్హత నిబంధనను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది.
అయితే ఇకపై అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హత పీహెచ్డీని తప్పనిసరిగా అమలు చేయనున్నారని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వివరించాయి. సెంట్రల్ వర్సిటీల్లో 10 వేల వరకు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రాల్లోని పలు వర్సిటీల్లోనూ వేలాదిగా ఖాళీలున్నాయని తెలిపాయి. వీటన్నిటి భర్తీలో కనీస అర్హత పీహెచ్డీ ఉన్న వారినే అనుమతించనున్నారని పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ప్రకటించారు.