వసంతక్కను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: మావోయిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ భార్య, దళ కమాండర్ పూజారి ధనలక్ష్మి అలియాస్ వసంతక్కను మంగళవారం ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్లో భారీ భద్రత నడుమ హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ ఆమెకు ఈనెల 24 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించారు. వసంతక్కతోపాటు మడికి దీమయ్య, ఉడత శంకర్, మడకం మాసా, నరసింహరావు, నందాలకు కూడా రిమాండ్ పొడిగించారు.
మొత్తం 10 కేసుల్లో...
వివిధ అభియోగాల నేపథ్యంలో 10 కేసుల్లో వసంతక్కకు రిమాండ్ విధించారు. దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈఏడాది జనవరి 8న జరిగిన హోంగార్డు నీలం నరేష్ హత్యకేసులో ఆమె నిందితురాలు. కేసులోని వివరాల ప్రకారం.. సంఘటన రోజు సాయంత్రం 4 గంటలకు పర్ణశాల గ్రామంలో హోంగార్డు నీలం నరేష్ తన స్నేహితులతో వాలీబాల్ ఆడుకోనుచుండగా మావోయిస్టు వెంకటాపురం ఏరియా శబరి దళం సభ్యులు నలుగురు నరేష్‌ను కాల్చి చంపారు. నరేష్ బావమరిది ఆకుల కృష్ణారావు ఫిర్యాదు మేరకు పోలీసులు వసంతక్కను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.