Vasanthakumar
-
కరోనాతో ఎంపీ వసంతకుమార్ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు హెచ్.వసంతకుమార్ (70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకి ఈనెల 10వ తేదీ నుంచి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. శుక్రవారం మధ్యాహ్నం మరింత విషమపరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆయన రాత్రి 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. (చదవండి : ఎంపీలకు కరోనా పరీక్షలు) 2019లో కన్యాకుమారి నుంచి లోక్‌సభకు ఎన్నికైన వసంతకుమార్... అంతకుముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. హరికృష్ణ పెరుమాళ్, తంగమాళ్ దంపతులకు 1950 ఏప్రిల్ 14న జన్మించిన వసంతకుమార్ తొలుత ఒక చిన్నపాటి దుకాణంతో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అంచలంచెలుగా ఎదుగుతూ వసంత్ అండ్ కో పేరున ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ షోరూంను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 64 శాఖలను నిర్వహిస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళసైకి వసంతకుమార్ దగ్గరి బంధువు. వసంతకుమార్ మృతిపట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి ఎంపీ వసంతకుమార్ అకాల మరణంపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీగా కన్యాకుమారితో పాటు తమిళనాడు అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తిండిపోతుందన్నారు. -
సుప్రీం బెంచ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
టీనగర్ : చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఇరవై ఏళ్లుగా ఎందుకు ఏర్పాటు చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పుదుచ్చేరికి చెందిన న్యాయవాది వసంతకుమార్ చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలు చేశారు. 1986లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశానని, అందులో ఢిల్లీలో మాత్రమే సుప్రీంకోర్టు ఉన్నందున దక్షిణాది ప్రజలు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు తమ అప్పీళ్లు, కేసుల కోసం ఢిల్లీకి రావాల్సివస్తోందని, దీంతో వారికి అధిక ఖర్చులు, సమయం వృథా జరుగుతోందన్నారు. అందువల్ల చెన్నై, కోల్‌కతా, ముంబైలలో సుప్రీం బెంచ్‌లు ఏర్పాటుచేయాలని కోరారు. దీన్ని అంగీకరించిన సుప్రీంకోర్టు 1986లోనే అప్పీలు చేసేందుకు సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటుచేసేందుకు ఉత్తర్వులిచ్చింది. అయితే దీనిగురించి గత 20 ఏళ్లుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఉత్తర్వులను నెరవేర్చేందుకు కోర్టు మళ్లీ ఒక ఉత్తర్వు జారీ చేయాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. అనంతరం దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇందులో కేంద్ర ప్రభుత్వం, న్యాయశాఖ చర్యలేమిటని ప్రశ్నించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, సల్మాన్‌ఖాన్ కుర్షిద్‌ను సలహాదారులుగా నియమిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. ఇరువురూ అందులోని సమస్యలను కోర్టులో తెలియజేయాలని కోరారు.