పాపాఘ్నిలో ఇద్దరు గల్లంతు
వేంపల్లె, న్యూస్‌లైన్ : పాపాఘ్ని నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గాజులపేట, వైఎస్ఆర్ నగర్‌కు చెందిన యువకులు పసుపులేటి మహేష్, కోనేటి నరహరి, పోలేపల్లె నవీన్ ఈత కొట్టేందుకు నది వద్దకు వెళ్లి గల్లంతు కాగా.. మహేష్‌ను స్థానికులు రక్షించడంతో సురక్షితంగా బయటపడ్డారు. సాయంత్రం 7గంటలవరకు గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ కనపడలేదు. రాత్రి కూడా జనరేటర్లు ఉపయోగించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ హాసం తెలిపారు.
స్నేహితులకు ఫోన్ చేసి...
వేంపల్లెలోని వైఎస్ఆర్ నగర్‌కు చెందిన నరహరి స్థానిక వాసవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గాజులపేటలో ఉన్న పసుపులేటి మహేష్‌కు, వైఎస్ఆర్ నగర్లో ఉన్న నవీన్‌కు ఫోన్ చేసి పాపాఘ్ని నది వద్దకు రావాలని తెలిపారు. మధ్యాహ్నానికి ఇద్దరు కలిసి పాపాఘ్ని నది బిడాలమిట్ట వద్దనున్న నరహరి వద్దకు వెళ్లారు.
అప్పటికే నరహరి బట్టలు విప్పి ఈత కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. మహేష్, నవీన్‌లు వద్దన్నా ఈత కొట్టాలని ఒత్తిడి తేవడంతో ముగ్గురు ఈత కొట్టేందుకు పాపాఘ్ని నదిలోకి దిగారు. కొంతసేపు ఆనందంగా ఈత కొట్టిన తర్వాత పెద్ద గుంతగా ఉన్న ప్రాంతంలో ముగ్గురు వెళ్లగా.. నరహరి, నవీన్‌లు గల్లంతయ్యారు. మహేష్ కేకలు వేయగా ఆ సమయంలో బహిర్భూమికి వచ్చిన హోటల్లో పనిచేస్తున్న సుబహాన్, మస్కగిరి చికెన్ సెంటర్లో పనిచేస్తున్న సర్దార్, ఒంటెద్దు యజమాని జాఫర్ అతనిని రక్షించగలిగారు.
సహాయక చర్యలు
ఇద్దరు గల్లంతైన విషయాన్ని సురిక్షితంగా బయటపడ్డ మహేష్ తెలియజేయడంతో అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాపాఘ్ని నది వద్దకు చేరుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాయంత్రం 7గంటలైనా వారి ఆచూకీ కనపడలేదు. విషయాన్ని తెలుసుకుని వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, పరిశీలకుడు రామమునిరెడ్డి అధికారులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
వైఎస్ఆర్ నగర్,
గాజులపేటలలో విషాదచాయలు
వేంపల్లెలోని వైఎస్ఆర్ నగర్, గాజులపేటకు చెందిన ఇద్దరు యువకులు పాపాఘ్ని నదిలో గల్లంతు కావడంతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరహరి, నవీన్‌లు ఇద్దరు అక్కాచెల్లెళ్లయినా పెద్ద గంగమ్మ, భవానీల పిల్లలు. బంధువుల రోదనలు మిన్నంటాయి.