Vasavi Mohan
-
వంద సినిమాలకు వందనం
పుస్తక పరిచయం వందేళ్ల తెలుగు సినిమాను, వంద సినిమాల విశేషాలతో చెప్పడం అరుదైన ప్రయత్నమే. అయినా ఆ సంక్లిష్టతను సరళతరం చేయడంలో చాలా వరకు సఫలం అయ్యారు పులగం చిన్నారాయణ. సినీ జర్నలిస్టుగానే కాకుండా, సినిమా మీద పెంచుకున్న విపరీతమైన ఆసక్తి కూడా ఆయనను ఈ పుస్తకం రాయడానికి ప్రోత్సహించి ఉండొచ్చు. పాఠకుడికి ఆసక్తి కలిగించే తెర వెనుక విశేషాలు పులగం తప్ప ఇంకెవరూ ఇంత బాగా చెప్పలేరేమో అనిపిస్తుంది. 1932లో విడుదలయిన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ నుంచి 2002లో వచ్చిన ‘హృదయాంజలి’ వరకు ఎంచుకున్న వంద సినిమాల గురించిన వందల కొద్దీ ఆసక్తి కలిగించే విశేషాలతో వెండితెరలాగే పుస్తకంలోని ప్రతిపేజీ కూడా తళతళలాడుతుంది. టూకీగా కథని పరిచయం చేయడమే కాకుండా, సినిమాలో కీలకంగా వ్యవహరించిన వారి ఇంటర్వ్యూలను సైతం ప్రచురించారు. సినిమాలో ఆ పాత్రలు, వాటి నేపథ్యం, ఆయా సినిమాలు సృష్టించిన రికార్డులు, వసూలు చేసిన కలెక్షన్లు కూడా శ్రద్ధగా అక్షరబద్ధం చేశారు. పాత సినిమాల పోస్టర్లు, నటులు, దర్శకుల అరుదైన ఫొటోలు అదనపు ఆకర్షణ. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ప్రియులకు ఇది పసందైన ‘పులగం’! పసిడితెర; రచన: పులగం చిన్నారాయణ; పేజీలు: 512; వెల: 350; ప్రచురణ: విజయా పబ్లికేషన్స్, విజయా గార్డెన్స్, 317, ఎన్.ఎస్.కె. శాలై, వడపళని, చెన్నై–600026. రచయిత ఫోన్: 8897798080 వాసవీ మోహన్ -
విలువలపై అక్షరాల పుప్పొడి
∙పుస్తక పరిచయం అనిర్వచనీయమైన అనుభూతులకు, ఊహించడానికి మాత్రమే వీలయ్యే ఉద్వేగాలకు అక్షరరూపం ఇవ్వడం పొత్తూరి విజయలక్ష్మి శైలి. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన రచనా ప్రస్థానంలో ఎన్నో అపురూపమైన కథలను పాఠకులకు అందించారు. హాస్య రచనల్లో తనది ఒక ప్రత్యేక ముద్ర. ఇక ‘పూర్వి’ పేరుతో 16 కథలతో వెలువడిన ఈ సంపుటి కొత్త తరంలో పేరుకుపోతున్న అనుబంధాల ఖాళీలను పూరించే ప్రయత్నం. పూర్వి, బాలరాజు, సుఖాంతం కథలు ఏక కాలంలో అనేక జీవితాల్లోని వివిధ పార్శా్వలను ప్రతిబింబిస్తే, ఆనాటి ముచ్చట్లు కథ కుటుంబ సభ్యుల సరదాలను కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంపుటిలోని చాలా కథలు కొన్ని వాస్తవ సందర్భాలు కావొచ్చు, కొన్ని కాల్పనిక ఘటనలు కావొచ్చు, కానీ అనుబంధాలు, విలువలు మాత్రం శాశ్వతం. వాటిని గౌరవించుకున్నన్నాళ్లూ ఈ కథలకు మరణం లేదు. బహుశా అక్షరాలలోనే కాదు, రచయిత్రి పాత్రలలో ఆచరించిన నిజాయితీ కూడా ఈ కథలకు ప్రాణమై నిలిచింది. కథలలోని పాత్రలు మనకు పదేపదే తారసపడడంతో ఆశ్చర్యం అనిపించదు. అయితే అన్ని కథలూ అంతర్ధానమవుతున్న మానవీయ విలువలపై ధిక్కారాలు కాదు, కొన్ని సుతారంగా మనసును కదిలించేవి, కొన్ని వెచ్చని కన్నీటిని కంటికి పరిచయం చేసేవి. లుప్తమైపోతున్న అనుబంధాలను సామాజిక మాధ్యమాలలో వెతుక్కుంటున్న నేటి యువతరం చదవాల్సిన పుస్తకం. (వ్యాసకర్త : వాసవీ మోహన్ )