విలువలపై అక్షరాల పుప్పొడి
∙పుస్తక పరిచయం
అనిర్వచనీయమైన అనుభూతులకు, ఊహించడానికి మాత్రమే వీలయ్యే ఉద్వేగాలకు అక్షరరూపం ఇవ్వడం పొత్తూరి విజయలక్ష్మి శైలి. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన రచనా ప్రస్థానంలో ఎన్నో అపురూపమైన కథలను పాఠకులకు అందించారు. హాస్య రచనల్లో తనది ఒక ప్రత్యేక ముద్ర.
ఇక ‘పూర్వి’ పేరుతో 16 కథలతో వెలువడిన ఈ సంపుటి కొత్త తరంలో పేరుకుపోతున్న అనుబంధాల ఖాళీలను పూరించే ప్రయత్నం. పూర్వి, బాలరాజు, సుఖాంతం కథలు ఏక కాలంలో అనేక జీవితాల్లోని వివిధ పార్శా్వలను ప్రతిబింబిస్తే, ఆనాటి ముచ్చట్లు కథ కుటుంబ సభ్యుల సరదాలను కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంపుటిలోని చాలా కథలు కొన్ని వాస్తవ సందర్భాలు కావొచ్చు, కొన్ని కాల్పనిక ఘటనలు కావొచ్చు, కానీ అనుబంధాలు, విలువలు మాత్రం శాశ్వతం. వాటిని గౌరవించుకున్నన్నాళ్లూ ఈ కథలకు మరణం లేదు. బహుశా అక్షరాలలోనే కాదు, రచయిత్రి పాత్రలలో ఆచరించిన నిజాయితీ కూడా ఈ కథలకు ప్రాణమై నిలిచింది. కథలలోని పాత్రలు మనకు పదేపదే తారసపడడంతో ఆశ్చర్యం అనిపించదు. అయితే అన్ని కథలూ అంతర్ధానమవుతున్న మానవీయ విలువలపై ధిక్కారాలు కాదు, కొన్ని సుతారంగా మనసును కదిలించేవి, కొన్ని వెచ్చని కన్నీటిని కంటికి పరిచయం చేసేవి. లుప్తమైపోతున్న అనుబంధాలను సామాజిక మాధ్యమాలలో వెతుక్కుంటున్న నేటి యువతరం చదవాల్సిన పుస్తకం.
(వ్యాసకర్త : వాసవీ మోహన్ )