రమణ భావన
పుస్తక పరిచయం
‘మనిషి ‘కకాకికీ’ల కొరకు పరుగులెత్తుతూ కీకారణ్యం లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. చికాకుల పాలవుతున్నాడు. విలువల వలువలు ఊడ్చివేస్తున్నాడు’ అంటారు డాక్టర్ కె.వి.రమణాచారి. ‘క’ అంటే కనకం, ‘కా’ అంటే కాంత, ‘కి’ అంటే కిరీటం(అధికారం), ‘కీ’ అంటే కీర్తి అని ఆయన వివరణ.
మరోచోట, మనిషికి తలనొప్పులెన్ని ఉన్నా– నాలుగు రకాల తలనొప్పులు మాత్రం భరింపరానివి, అంటూ ఈ శ్లోకాన్ని ఉటంకిస్తారు.
‘అవిధేయో భృత్యజనః/ శఠాని మిత్రాణి, నిర్దయః స్వామీ
వినయ రహితా చ భార్యా/ మస్తక శూలాని చత్వారి’
మాట వినని సేవకుడు, హితశత్రువుల్లా ఉండే మిత్రులు, నిర్దయుడైన యజమాని, అణకువలేని ఇల్లాలు– ఈ నాలుగూ మనిషికి తలనొప్పులు. ఇవి లేనివారు అదృష్టవంతులు!
‘సాహిత్యమంటే ఎంతో ఇష్టం’ ఉన్న రమణ ఐఏఎస్ అధికారిగా ఎంతో బిజీగావుంటూ కూడా మూడు దశాబ్దాల క్రితం నుంచీ ఆకాశవాణి ‘భావన’ కార్యక్రమంలో తన అభిప్రాయాలను పంచుకునేవారు. అలా ‘అంకురించిన ఆ మొలకలన్నింటి’నీ, తర్వాత ‘రచన’లో వ్యాసాలుగానూ రాశారు. ‘మనందరి మంచి కోరుతూ రాసిన ఈ యాభై వ్యాసాల సంపుటి’ని అమృత వర్షిణి పేరిట శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ఇప్పుడు పుస్తకంగా తెచ్చింది.
(అమృత వర్షిణి; రచన: డాక్టర్ కె.వి.రమణ; పేజీలు: 114;
వెల: 50; ప్రతులకు: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, ఫోన్: 9391343916 )