మాట్లాడుతున్న బండారు లక్ష్మయ్య చిత్రంలో అమృత
మిర్యాలగూడ టౌన్ : పేరుమళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, కుల నిర్మూలన ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ గడ్డం సదానందం, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సాంబశివరావు డిమాండ్ చేశారు.బుధవారం పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని పేరుమళ్ల ప్రణయ్ కుటుంబ సభ్యులను పరమార్శించారు. అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పీడీ యాక్టు కేసులో బెయిల్‌పై విడుదల కావడం వలన బాధితులు అయిన అమృత వర్షిణి, బాలస్వామి, ప్రణయ్ కుమారుడు నిహాన్ ప్రణయ్‌లకు ప్రమాదం పొంచి ఉందన్నారు.
మారుతిరావును ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి బహిష్కరించాలన్నారు. ప్రత్యేక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి న్యాయ విచారణ ప్రారంభించాలన్నారు. నింధితులకు శిక్ష పడేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. నిందితులు విడుదల కావడంతో నేర విచారణ, న్యాయ విచారణలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని, సాక్షాల బాధితులకు రక్షణ లేకుండా పోతుందన్నా రు. నిందితులు నేరం నుంచి తప్పించుకోకుండా పోలీసులు వెంటనే చార్జీషీట్‌ను వేయాలన్నారు. నిందితులకు కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఆలోచించాలని, నిందితులు కేవలం పీడీ యాక్టు కేసులో మాత్రమే బెయిల్‌పై వచ్చారని, హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం ఏ కేసు అయినా కూడా 90రోజుల్లో చార్జిషీట్‌ను పోలీసులు వేయాల్సి ఉంటుందన్నారు. అమృత విషయంలో సోషల్ మీడియాలో కొంత మంది ఆసభ్యకర పోస్టులు పెట్టుతున్నందున వారిపై చర్యలను తీసుకోవాలన్నారు. అమృత వర్షిణి మాట్లాడుతూ చాల మంది మారుతిరావు గురించి తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. కొంతమంది మారుతీరావు లెజండ్ తదితర పేర్లతో పోస్టులు చేస్తున్నారని, మారుతిరావు గత చరిత్ర తెలియకనే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ మా ప్రాణం ఉన్నంత వరకు నిందితులకు శిక్షపడేంత వరకు పోరాడుతామని అన్నారు. సమావేశంలో సామాజిక కార్యకర్తలు డాక్టర్ రాజు, శ్రీరాములు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment