Pusthaka Parichayam
-
రమణ భావన
పుస్తక పరిచయం ‘మనిషి ‘కకాకికీ’ల కొరకు పరుగులెత్తుతూ కీకారణ్యం లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. చికాకుల పాలవుతున్నాడు. విలువల వలువలు ఊడ్చివేస్తున్నాడు’ అంటారు డాక్టర్ కె.వి.రమణాచారి. ‘క’ అంటే కనకం, ‘కా’ అంటే కాంత, ‘కి’ అంటే కిరీటం(అధికారం), ‘కీ’ అంటే కీర్తి అని ఆయన వివరణ. మరోచోట, మనిషికి తలనొప్పులెన్ని ఉన్నా– నాలుగు రకాల తలనొప్పులు మాత్రం భరింపరానివి, అంటూ ఈ శ్లోకాన్ని ఉటంకిస్తారు. ‘అవిధేయో భృత్యజనః/ శఠాని మిత్రాణి, నిర్దయః స్వామీ వినయ రహితా చ భార్యా/ మస్తక శూలాని చత్వారి’ మాట వినని సేవకుడు, హితశత్రువుల్లా ఉండే మిత్రులు, నిర్దయుడైన యజమాని, అణకువలేని ఇల్లాలు– ఈ నాలుగూ మనిషికి తలనొప్పులు. ఇవి లేనివారు అదృష్టవంతులు! ‘సాహిత్యమంటే ఎంతో ఇష్టం’ ఉన్న రమణ ఐఏఎస్ అధికారిగా ఎంతో బిజీగావుంటూ కూడా మూడు దశాబ్దాల క్రితం నుంచీ ఆకాశవాణి ‘భావన’ కార్యక్రమంలో తన అభిప్రాయాలను పంచుకునేవారు. అలా ‘అంకురించిన ఆ మొలకలన్నింటి’నీ, తర్వాత ‘రచన’లో వ్యాసాలుగానూ రాశారు. ‘మనందరి మంచి కోరుతూ రాసిన ఈ యాభై వ్యాసాల సంపుటి’ని అమృత వర్షిణి పేరిట శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ఇప్పుడు పుస్తకంగా తెచ్చింది. (అమృత వర్షిణి; రచన: డాక్టర్ కె.వి.రమణ; పేజీలు: 114; వెల: 50; ప్రతులకు: శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, ఫోన్: 9391343916 ) -
విలువలపై అక్షరాల పుప్పొడి
∙పుస్తక పరిచయం అనిర్వచనీయమైన అనుభూతులకు, ఊహించడానికి మాత్రమే వీలయ్యే ఉద్వేగాలకు అక్షరరూపం ఇవ్వడం పొత్తూరి విజయలక్ష్మి శైలి. మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన రచనా ప్రస్థానంలో ఎన్నో అపురూపమైన కథలను పాఠకులకు అందించారు. హాస్య రచనల్లో తనది ఒక ప్రత్యేక ముద్ర. ఇక ‘పూర్వి’ పేరుతో 16 కథలతో వెలువడిన ఈ సంపుటి కొత్త తరంలో పేరుకుపోతున్న అనుబంధాల ఖాళీలను పూరించే ప్రయత్నం. పూర్వి, బాలరాజు, సుఖాంతం కథలు ఏక కాలంలో అనేక జీవితాల్లోని వివిధ పార్శా్వలను ప్రతిబింబిస్తే, ఆనాటి ముచ్చట్లు కథ కుటుంబ సభ్యుల సరదాలను కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ సంపుటిలోని చాలా కథలు కొన్ని వాస్తవ సందర్భాలు కావొచ్చు, కొన్ని కాల్పనిక ఘటనలు కావొచ్చు, కానీ అనుబంధాలు, విలువలు మాత్రం శాశ్వతం. వాటిని గౌరవించుకున్నన్నాళ్లూ ఈ కథలకు మరణం లేదు. బహుశా అక్షరాలలోనే కాదు, రచయిత్రి పాత్రలలో ఆచరించిన నిజాయితీ కూడా ఈ కథలకు ప్రాణమై నిలిచింది. కథలలోని పాత్రలు మనకు పదేపదే తారసపడడంతో ఆశ్చర్యం అనిపించదు. అయితే అన్ని కథలూ అంతర్ధానమవుతున్న మానవీయ విలువలపై ధిక్కారాలు కాదు, కొన్ని సుతారంగా మనసును కదిలించేవి, కొన్ని వెచ్చని కన్నీటిని కంటికి పరిచయం చేసేవి. లుప్తమైపోతున్న అనుబంధాలను సామాజిక మాధ్యమాలలో వెతుక్కుంటున్న నేటి యువతరం చదవాల్సిన పుస్తకం. (వ్యాసకర్త : వాసవీ మోహన్ ) -
తెలంగాణ కవుల గానం
పుస్తక పరిచయం ఉగాది రోజు మన ఇంటిలో కనిపించే పండుగ కళ ఏదో ఈ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు కలుగుతుంది. మామూలుగానైతే సాంస్కృతిక శాఖ నుంచి ఉత్పత్తి అయ్యే సాహిత్యం మనసుకు తీసుకోవాల్సినంత బరువుగా ఉండదు. కానీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ స్వయంగా కవి కావడం వల్ల, సంపాదకత్వం వహించడం వల్ల ఈ 200 పేజీల పుస్తకానికి ఒకింత నిండుదనం వచ్చింది. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన తొలి కవిసమ్మేళనంలోని 60 కవితలు ఇందులో ఉన్నాయి. ‘మీరక్కడ అనంత నిరాహారదీక్షలో ఉండండి/ నేను మీకోసం అంతర్సుందర సద్దగట్క వండుతుంటాను’ అంటాడు దెంచనాల శ్రీనివాస్. సామిడి జగన్‌రెడ్డి ‘ముసాఫిర్లకు చార్కమానై దునియాకే కోహినూరై/మా నాజూకు పనితనానికి నఖల్గా నిలిచి’నదంటూ హైదరాబాద్‌ను కీర్తిస్తాడు. అయితే, ‘నా బాధ ప్రపంచ బాధ’ కోవకు చెందినవాటికంటే తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక స్పృహకు చెందిన కవితలకే ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. పాషా కొత్తసాలు (మన్మథ నామ ఉగాది-ప్రపంచ కవితా దినోత్సవ కవితా సంకలనం); ప్రతులకు: డెరైక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్.