టోకన్ సమ్మె విజయవంతం చేయండి
యైటింక్లయిన్కాలనీ: కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 2వ తేదీన జరిగే టోకెన్ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. గురువారం స్థానిక యూనియన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయన్నారు. బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని మార్పుచేయాలని చూస్తోందన్నారు. మార్పు వస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో పర్మినెంట్ కార్మికులు ఉండరన్నారు. తీసుకో-తీసేయ్ అనే పద్ధతిన కార్మికుల నియామకం ఉంటుందన్నారు.
పర్మినెంట్ కార్మికులకు టర్మినల్ బెనిఫిట్ ఉండబోవన్నారు. పెట్టుబడి దారులకు కొమ్ముకాసే విధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్నారు. టోకెన్ సమ్మెకు బీజేపీ అనుబంధ బీఎంఎస్తో పాటు జాతీయ కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేవారిని గుర్తించి యూనియన్లో తొలగించేందుకు జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయన్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వైఫల్యం వల్లే సింగరే ణిలో సమస్యలు జఠిలంగా మారాయన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంస్థ సీఅండ్ఎండీని కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశామన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కలవనున్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు రాజరత్నం, వైవీరావు, ప్రకాశ్, మల్లయ్య, మోహన్రావు, నారాయణ, సమ్మయ్య, రాంచందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.