ఫార్ములేషన్స్ మార్కెటింగ్లోకి వాసు గ్రూప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల పంపిణీ రంగంలోని వాసు గ్రూప్ తాజాగా ఫార్ములేషన్స్ మార్కెటింగ్లోకి ప్రవేశించింది. ముందుగా గైనకాలజీ, పీడియాట్రిక్, ఈఎన్టీ తదితర విభాగాలకు సంబంధించిన ఔషధాలను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ చైర్మన్ బి. భానుమార్తి తెలిపారు. రెండు, మూడు నెలల తర్వాత హృద్రోగాలు, మధుమేహం వంటి వాటి చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ఇక్కడ ఆయన విలేకరులకు వివరించారు.
ప్రస్తుతం సుమారు 49 ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని, మరో 10 ఔషధాలపై కసరత్తు జరుగుతోందని భానుమూర్తి చెప్పారు. మొత్తం మీద ఏడాది వ్యవధిలో 150 ఔషధాల దాకా అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు. వీటిని అకుమ్స్, అయోసిస్ మొదలైన సంస్థలతో తయారు చేయించి, తమ బ్రాండ్ మీద విక్రయించనున్నట్లు భానుమూర్తి తెలిపారు. ప్రాథమికంగా వీటిపై ప్రతి నెలా రూ.1 కోటి మేర టర్నోవరు అంచనా వేస్తున్నామని, పెరుగుదలను బట్టి సొంత తయారీ ప్లాంటును నెలకొల్పే యోచన కూడా ఉందన్నారు. పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్లోనూ డిపోలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో విక్రయాలు ఉంటాయన్న భానుమూర్తి, 2020 నాటికి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.