తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టనట్టే: సీపీఎం
తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టిన తీరుపై లెఫ్ట్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టనట్టేనని సీపీఎం ఎంపీ వాసుదేవ్ ఆచార్య వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు అంశం బిజినెస్ లిస్టులో లేదు అని ఆయన తెలిపారు. 'అదనపు అజెండా సభ్యులకు చేరలేదు. లోక్‌సభ రూల్స్‌ను ఉల్లంఘించారు. స్పీకర్ మీరాకుమార్ సభను బిల్లులో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు కాని ఆతర్వాత సభలో బిల్లును ప్రవేశపెడుతున్నట్టుగా హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఎక్కడా చదవలేదు అని వాసుదేవ్ ఆచార్య అన్నారు.
తెలంగాణ బిల్లు లోకసభలో ప్రవేశపెట్టిన తర్వాత సభలో జరిగిన ఘటనలపై సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పందించారు. సభలో జరిగిన సంఘటనలు ఉద్దేశ పూర్వకంగా చేసినవే అని ఏచూరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రోత్సహం వల్లే అలాంటి జరిగాయి అని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ లో చోటుచేసుకున్న ఘటనలకు కేంద్రం, కాంగ్రెస్ బాధ్యత వహించాలి అని ఏచూరి అన్నారు.
సభ సజావుగా నడవనీయకూడదన్నది కాంగ్రెస్ ఉద్దేశం. వివాదం ఉన్నప్పుడు ముందస్తు సంప్రదింపులు ఎందుచేయలేదు. విపక్షాలను ముందుగా విశ్వాసంలోకి ఎందుకు తీసుకోలేదు అని ఏచూరి ప్రశ్నించారు.