ఈ -కామర్స్ విక్రయాలపై పన్ను
తమిళనాడు, కేరళ తరహాలో వ్యాట్ రిఫండ్ విధానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఈ-కామర్స్ పేరుతో ఆన్లైన్ అమ్మకాలు విపరీ తంగా పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడయ్యే వస్తువులపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వేలకోట్ల విలువైన ఉత్పత్తులు ఆన్లైన్లో అమ్ముడవుతుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రావడంలేదు. ఎక్కడ వస్తువులను పంపిణీ చేస్తారో అక్కడ పన్ను వసూలు చేసేం దుకు సర్కార్ సిద్ధం అవుతోంది. తద్వారా భారీగా ఆదాయం సమకూరుతుం దని ఆర్థికశాఖ అంచనా వేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి...
వ్యాపారులకు వ్యాట్ తిరిగి చెల్లింపు(రిఫండ్) నిబంధనలు మార్చాల్సిన అవసరముంది. దీన్ని కర్నాటక, తమిళనాడులో ఉన్నట్టే ఇక్కడ అమలు చేయాలి.
వ్యాట్ రిఫండ్‌పై తనిఖీ విధానం సరిగా లేదు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంపై ఆధారపడకూడదు. గతంలో ఐదేళ్ల పన్ను రాయితీ పొందిన సంస్థలు, పరిశ్రమలు ఆ తరువాత చెల్లిస్తున్న పన్ను ఎంతో అంచనా వేయాలి.
పన్ను రాయితీ సమయంలో ఉత్పత్తి, అమ్మకాలను సరిపోల్చుకోవాలి.
కల్లు దుకాణాలతో ఏటా దాదాపు వెయ్యికోట్ల ఆదాయం తగ్గుతుంది. నష్టాన్ని తగ్గించుకునేందుకు కల్లు దుకాణాల ఏర్పాటు, చెట్లసంఖ్యను అంచనా వేయాలి.
అక్రమమద్యాన్ని అరికట్టడానికి నల్లబెల్లంపై గట్టినిఘా పెట్టాలి.
విలాస, వినోద రంగాల నుంచి వస్తున్న పన్నును పునఃపరిశీలించాలి.
కేంద్ర అమ్మకం పన్నులపై నష్టపరిహారం రాబట్టుకోవడానికి ఒత్తిడి తేవాలి.
రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉన్నా, అలాచేయకుండా ఒప్పందాలతో నడిచే వాటిని రిజిస్ట్రేషన్ల పరిధిలోకి తేవాలి. దీనికి స్పెషల్ సెల్స్‌ను ఏర్పాటు చేయాలి.
రవాణా, సరకురవాణా వాహనాలపై విధిస్తున్న పన్నులో జీవితకాలపన్ను లేదా మూడు నెలలకోమారు విధిస్తున్న పన్ను ఏది మంచిదో పరిశీలించాలి. కర్నాటక, మహారాష్ట్రలో అమలు అవుతున్న విధానాన్ని పరిశీలించాలి.