Vayyaribhama
-
వయ్యారిభామతో పంటలకు ప్రమాదం
– వేరుశనగ, పత్తి, జొన్న, కందిలో సస్యరక్షణ చర్యలు – ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు పరిసర ప్రాంతాల్లో వయ్యారిభామ లాంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నివారించుకోవాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో వేసిన పంటలకు ఆశించిన తెగులు, చీడపీడల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. + వేరుశనగ పంట ప్రస్తుతం కొన్ని చోట్ల శాఖీయ దశ, మరికొన్ని ప్రాంతాల్లో ఊడలు దిగే దశలో ఉన్నందున అక్కడక్కడా రసంపీల్చు పురుగు ఆశించింది. ఈ క్రమంలో తామరపురుగుల నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ + 1 లీటర్ వేపనూనె + ఒక కిలో సబ్బుపొడి 200 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో శనగపచ్చ పురుగు ఆశించినందున 1.5 గ్రాములు లార్విన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తుకున్న 45 రోజుల్లోగా కలుపు లేకుండా అంతరకృషి చేసుకోవాలి. వయ్యారిభామ లాంటి కలుపు మొక్కలు లేకుండా నాశనం చేసుకోవాలి. లేదంటే ప్రమాదకరమైన మొవ్వకుళ్లు, కాండంకుళ్లు తెగులు సోకే అవకాశం ఉంది. + పత్తిలో గులాబీరంగు పురుగు ఉన్నట్లు గమనిస్తే తొలుత 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే 2 మి.లీ క్వినాల్పాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము థయోడికార్బ్ లేదా 2 మి.లీ ప్రొపినోఫాస్ లీటర్ నీటికి కలిపి పంట బాగా తడిచేలా 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉనికి, ఉధృతి తెలుసుకునేందుకు ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్ ఎరలు ఏర్పాటు చేయాలి. + వరిలో అక్కడక్కడ కాండంతొలిచే పురుగు ఆశించినందున 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ ఆశించిన పొలాల్లో ఎకరాకు 330 మి.లీ అప్లాడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదలుకోవాలి. + ఇటీవల వర్షాలకు విత్తిన కంది పంటకు సంబంధించి మొలకెత్తిన వెంటనే ముక్కుపురుగు ఆశించే అవకాశం ఉంది. ఒక నూలుగుడ్డలో 5 కిలోల మలాథియాన్ పొడిమందు ఎకరా పొలంలో మొక్కలపైన చల్లాలి. మొక్కలు ఒత్తుగా లేకుండా జాగ్రత్త పడాలి. 30 రోజుల్లోగా కలుపు లేకుండా చూసుకోవాలి. + ఇటీవల కురిసిన వర్షాలకు ఆముదం పంటలో పైపాటుగా ఎకరాకు 6 కిలోలు యూరియా వేసుకోవాలి. + ఇటీవల వేసిన జొన్నకు కాండంతొలుచు పురుగు ఆశించినందున ఎకరాకు 320 మి.లీ మనోక్రోటోఫాస్ లేదా 60 మి.లీ రేనాక్షిపైర్ 200 లీటర్ల నీటికి కలిపి మొలకెత్తిన 10 నుంచి 12 రోజుల్లోగా పిచికారీ చేసుకోవాలి. -
విస్తరిస్తున్న వయ్యారిభామ
అన్నదాతల పాలిట శాపంగా మారిన కలుపుమొక్క శ్వాసకోశ, చర్మ వ్యాధులకు మూలం పంటను ఎదగనీయని మొక్క దృష్టి సారించని అధికారులు ఆందోళనలో అన్నదాతలు మెదక్:వయ్యారిభామ అనే కలుపు మొక్క అన్నదాతల పాలిట శాపంగా మారింది. దానిపేరులోనే అందం ఉన్నప్పటికీ పనితీరుమాత్రం ఘోరమే.. అది మొలకెత్తిన చోట ఏ పంట ఎదగనీయదు...దాని నుంచి వచ్చే గాలితో శ్వాసకోశ, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. పశువులు మేసినా ప్రాణపాయం తప్పదని...సాక్షాత్తు వ్యవసాయ అధికారులు చెబుతున్నారంటే ఆ మొక్క సృష్టించే విధ్వంసం అంతాఇంత కాదు. రోజు రోజుకు విస్తరిస్తున్న వయ్యారిభామ విషపు మొక్కను అంతం చేసేందుకు పాలకులు, అధికారులుగానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో అన్నదాతల పాలిట ఆ మొక్కశాపంగా మారింది. జిల్లాలో ఎక్కడచూసినా ఈ కలుపుమొక్కలే కనిపిస్తాయి. సుమారు 7 దశాబ్దాల క్రితం దక్షిణ అమెరికా నుంచి జొన్నలు దిగుమతి చేసుకున్న క్రమంలో ఈ మొక్కకు సంబంధించిన విత్తనాలు ఆ ధాన్యంలో వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్క మొలకెత్తి పూతదశకు చేరినప్పుడు వీచే గాలిలో దీని విత్తనాలు గాలి తాకిడికి వేలాది అడుగుల దూరం వరకు వెళ్లిపోతాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొక్క మొలకెత్తిన ప్రాంతంలో ఎలాంటి పంట మొక్కలు, ఇతర మొక్కలుగాని ఎదగవని చెబుతున్నారు. ఈ మొక్క వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులతోపాటు చర్మవ్యాధులు వస్తాయని అంటున్నారు. అన్నదాతలకు వచ్చే ఽశ్వాసకోశ వ్యాధులు కేవలం దీనివల్లేనని పేర్కొంటున్నారు. పశువులు ఈ మొక్కను మేషాయంటే మరణం సంభవిస్తుందని వెటర్నరి అధికారులు పేర్కొంటున్నారు. ఈ మొక్కను నామరూపల్లేకుండా తుదముట్టించాలంటే ఒక్క రైతుల వల్లే కాదని, ప్రభుత్వ చర్యలు తప్పనిసరి అని ఓ జిల్లా ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈజీఎస్ వంటి పథకాల్లో భాగంగా ఈ మొక్కలను పూర్తిగా తొలగించి నిప్పుపెట్టి కాల్చివేస్తే తప్ప బయట పడటం కష్టమేనని చెబుతున్నారు. ఏదేమైనా అన్నంపెట్టే రైతన్నను ఈ విషఽపు మొక్కబారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
వయ్యారి భామపై బ్రహ్మాస్త్రం.. ఉప్పు!
2 లీటర్ల నీటిలో 1 కిలో కల్లుప్పు కలిపిన ద్రావణం చల్లితే చాలు వయ్యారిభామ మొక్క వాడిపోయి, క్రమంగా మాడిపోతుంది వయ్యారి భామ.. మన వ్యవసాయ రంగం మూలుగను పీల్చేస్తున్న సమస్యల్లో ఈ మహమ్మారి కలుపు మొక్క ఒకటి. దీన్ని క్యారెట్ గ్రాస్ అని, కాంగ్రెస్ కలుపు అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ఏడు కలుపు మొక్కల్లో ఇదొకటి. మన పచ్చిక బయళ్లు, పంట పొలాలు వయ్యారిభామ దురాక్రమణకు గురవుతున్నాయి. ఇది విస్తరించిన పంట చేలల్లో 40 నుంచి 50 శాతం అంటే సగానికి సగం పంట దిగుబడిని రైతులు నష్టపోతూనే ఉన్నారు. మన దేశంలో 3.5 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిందని ఒక అంచనా. నిజానికి దీని బెడద ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇతర మొక్కలకు చోటులేకుండా చేసి జీవవైవిధ్యాన్ని చావు దెబ్బ తీస్తోంది. అంతేకాదు తీవ్ర ఆరోగ్య సమస్యలు సృష్టిస్తూ మనుషులు, పశువులను కూడా ఇది పీడించుకు తింటున్నది. ఇంతటి విపత్తును సృష్టిస్తున్న వయ్యారి భామను మట్టుబెట్టలేమా? కలుపు మందులతో చేటు.. కాంగ్రెస్ గడ్డి నిర్మూలనకు చాలా మంది రైతులు రసాయనిక కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు మందులు చాలా ఖరీదైనవే కాకుండా.. వాటి వల్ల పంట భూమి, గాలి, నీరు, పర్యావరణం విషతుల్యమవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. దీని సమస్య ఎక్కువగా ఉన్న పొలాల్లో మెక్సికన్ బీటిల్ అనే పురుగులను ఎకరానికి 200 నుంచి 4 వేల వరకు వదలడం, బంతి మొక్కలు పెంచడం, పూతకు రాక ముందే వయ్యారి భామ మొక్కల్ని పీకి కంపోస్టు చేయడం.. వంటి పరిష్కారాలున్నా.. వీటిని అమలు చేయడం అంత సులభం కాకపోవడంతో ఈ మహమ్మారి కలుపు బతికిపోతోంది. అయితే, ఇక దీని పప్పులుడకవు. కేవలం.. కల్లుప్పు(సముద్రం ఉప్పు) ద్రావణాన్ని పిచికారీ చేసి వయ్యారిభామను పూర్తిగా నిర్మూలించే పద్ధతిని ప్రకృతి వ్యవసాయదారుడొకరు ఇటీవల కనుగొన్నారు. అతని పేరు తిరుమూర్తి. స్వస్థలం తమిళనాడులోని సత్యమంగళం. ఇదీ ఆయన అనుభవం.. తొలుత 10 లీటర్ల నీటిలో 1 కిలో కల్లుప్పు కలిపి పిచికారీ చేశాడు. ఫలితం లేదు. ఉప్పు మోతాదు 2, 3, 4, 5 కిలోలకు పెంచి చూశాడు. 10 లీటర్ల నీటిలో 5 కిలోల కల్లుప్పు (అంటే.. 2 లీటర్ల నీటికి కిలో కల్లుప్పు చొప్పున) కలిపిన ద్రావణాన్ని చల్లినప్పుడు చప్పున ఫలితం కనిపించింది. ఈ ద్రావణం చల్లిన కొద్ది గంటల్లోనే వయ్యారి భామ మొక్క వాడిపోయింది. తర్వాత పూర్తిగా మాడిపోయింది. ఉప్పు నీటి ప్రభావం వల్ల వయ్యారిభామ విత్తనాలు మొలకెత్తే శక్తిని కోల్పోవడాన్ని కూడా ఆయన గమనించాడు. కొబ్బరి తోటలో ఒక్కో చెట్టుకు ఏడాదికోసారి 2 కిలోల కల్లుప్పు వేయడం ఆయనకు అలవాటు. అయితే, కొబ్బరి తోటలో వయ్యారి భామ మొక్కలపై కల్లుప్పు ద్రావణాన్ని పిచికారీ చేస్తే చెట్లకు వేరుగా ఉప్పు వేయాల్సిన అవసరం లేకుండా పోయిందని తిరుమూర్తి గమనించారు. ఉప్పు ద్రావణం చల్లేటప్పుడు పండ్ల మొక్కలు, పంట మొక్కల ఆకులపై పడకుండా జాగ్రత్తపడటం అవసరం. కాంగ్రెస్ గడ్డితో కంపోస్టు ఇలా.. వయ్యారి భామ మొక్కల్లో మంచి పోషకాలున్నాయి. పూతకు రాకముందే ఈ మొక్కలను వేళ్లతో సహా పీకి కంపోస్టు చేసుకోవచ్చు. పొలంలో 3 అడుగుల లోతు గొయ్యి తీయాలి. పీకిన పార్థీనియం మొక్కలను వరుసలుగా వేయాలి. ఒక వరుస కలుపు వేసిన తరువాత దాని మీద ఆవు పేడను నీటిలో కలిపి చల్లుకోవాలి. ఇలా చివరి వరకు వరుసలుగా వేసిన తరువాత పైన పేడ కలిపిన మట్టితో మెత్తుకోవాలి. 60 నుంచి 90 రోజుల్లో చక్కటి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. పార్థీనియం కంపోస్టులో ఇతర కంపోస్టు కంటే ఎక్కువ పోషకాలుంటాయి. పొలాన్ని పంటలు విత్తటానికి సిద్ధం చేసే సమయంలో.. పొలానికి నీటి తడి పెడితే.. వయ్యారి భామ విత్తనాలు మొలకెత్తుతాయి. అవి మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు కల్లుప్పు ద్రావణాన్ని పిచికారీ చేస్తే.. ఆ తర్వాత వేసే పంటకు వయ్యారి భామ బెడద తప్పుతుందని ఆయన సూచిస్తున్నారు. ధర తక్కువే కాబట్టి.. కల్లుప్పు ద్రావణం చల్లడానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. సులువైన పద్ధతే కాబట్టి.. మీరూ ఇలా చేసి చూడండి! అయితే, ఉప్పు ద్రావణం అతిగా చల్లినా భూసారం దెబ్బతినే ప్రమాదం ఉంది జాగ్రత్త. పార్థీనియం మహమ్మారిని మట్టుబెట్టే మరేదైనా మెరుగైన అనుభవం మీకుంటే... ‘సాగుబడి’ ద్వారా రైతులతో పంచుకోండి! - సాగుబడి డెస్క్