వయ్యారిభామతో పంటలకు ప్రమాదం
– వేరుశనగ, పత్తి, జొన్న, కందిలో సస్యరక్షణ చర్యలు
– ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు పరిసర ప్రాంతాల్లో వయ్యారిభామ లాంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నివారించుకోవాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో వేసిన పంటలకు ఆశించిన తెగులు, చీడపీడల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
+ వేరుశనగ పంట ప్రస్తుతం కొన్ని చోట్ల శాఖీయ దశ, మరికొన్ని ప్రాంతాల్లో ఊడలు దిగే దశలో ఉన్నందున అక్కడక్కడా రసంపీల్చు పురుగు ఆశించింది. ఈ క్రమంలో తామరపురుగుల నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ + 1 లీటర్ వేపనూనె + ఒక కిలో సబ్బుపొడి 200 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో శనగపచ్చ పురుగు ఆశించినందున 1.5 గ్రాములు లార్విన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తుకున్న 45 రోజుల్లోగా కలుపు లేకుండా అంతరకృషి చేసుకోవాలి. వయ్యారిభామ లాంటి కలుపు మొక్కలు లేకుండా నాశనం చేసుకోవాలి. లేదంటే ప్రమాదకరమైన మొవ్వకుళ్లు, కాండంకుళ్లు తెగులు సోకే అవకాశం ఉంది.
+ పత్తిలో గులాబీరంగు పురుగు ఉన్నట్లు గమనిస్తే తొలుత 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే 2 మి.లీ క్వినాల్‌పాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము థయోడికార్బ్ లేదా 2 మి.లీ ప్రొపినోఫాస్ లీటర్ నీటికి కలిపి పంట బాగా తడిచేలా 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉనికి, ఉధృతి తెలుసుకునేందుకు ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్ ఎరలు ఏర్పాటు చేయాలి.
+ వరిలో అక్కడక్కడ కాండంతొలిచే పురుగు ఆశించినందున 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సుడిదోమ ఆశించిన పొలాల్లో ఎకరాకు 330 మి.లీ అప్లాడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు వదలుకోవాలి.
+ ఇటీవల వర్షాలకు విత్తిన కంది పంటకు సంబంధించి మొలకెత్తిన వెంటనే ముక్కుపురుగు ఆశించే అవకాశం ఉంది. ఒక నూలుగుడ్డలో 5 కిలోల మలాథియాన్ పొడిమందు ఎకరా పొలంలో మొక్కలపైన చల్లాలి. మొక్కలు ఒత్తుగా లేకుండా జాగ్రత్త పడాలి. 30 రోజుల్లోగా కలుపు లేకుండా చూసుకోవాలి.
+ ఇటీవల కురిసిన వర్షాలకు ఆముదం పంటలో పైపాటుగా ఎకరాకు 6 కిలోలు యూరియా వేసుకోవాలి.
+ ఇటీవల వేసిన జొన్నకు కాండంతొలుచు పురుగు ఆశించినందున ఎకరాకు 320 మి.లీ మనోక్రోటోఫాస్ లేదా 60 మి.లీ రేనాక్షిపైర్ 200 లీటర్ల నీటికి కలిపి మొలకెత్తిన 10 నుంచి 12 రోజుల్లోగా పిచికారీ చేసుకోవాలి.