వయ్యారి భామపై బ్రహ్మాస్త్రం.. ఉప్పు! | Salt helps to threat from problems of vayyaribhama | Sakshi
Sakshi News home page

వయ్యారి భామపై బ్రహ్మాస్త్రం.. ఉప్పు!

Published Tue, Jun 16 2015 5:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

ఏపుగా పెరుగుతున్న వయ్యారి భామ మొక్కలు. (పక్కన) ఉప్పు ద్రావణం పిచికారీ చేశాక మాడిపోయిన దృశ్యం

ఏపుగా పెరుగుతున్న వయ్యారి భామ మొక్కలు. (పక్కన) ఉప్పు ద్రావణం పిచికారీ చేశాక మాడిపోయిన దృశ్యం

2 లీటర్ల నీటిలో 1 కిలో కల్లుప్పు కలిపిన ద్రావణం చల్లితే చాలు
 వయ్యారిభామ మొక్క వాడిపోయి, క్రమంగా మాడిపోతుంది

 
వయ్యారి భామ.. మన వ్యవసాయ రంగం మూలుగను పీల్చేస్తున్న సమస్యల్లో ఈ మహమ్మారి కలుపు మొక్క ఒకటి. దీన్ని క్యారెట్ గ్రాస్ అని, కాంగ్రెస్ కలుపు అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ఏడు కలుపు మొక్కల్లో ఇదొకటి. మన పచ్చిక బయళ్లు, పంట పొలాలు వయ్యారిభామ దురాక్రమణకు గురవుతున్నాయి. ఇది విస్తరించిన పంట చేలల్లో 40 నుంచి 50 శాతం అంటే సగానికి సగం పంట దిగుబడిని రైతులు నష్టపోతూనే ఉన్నారు. మన దేశంలో 3.5 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిందని ఒక అంచనా. నిజానికి దీని బెడద ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇతర మొక్కలకు చోటులేకుండా చేసి జీవవైవిధ్యాన్ని చావు దెబ్బ తీస్తోంది. అంతేకాదు తీవ్ర ఆరోగ్య సమస్యలు సృష్టిస్తూ మనుషులు, పశువులను కూడా ఇది పీడించుకు తింటున్నది. ఇంతటి విపత్తును సృష్టిస్తున్న వయ్యారి భామను మట్టుబెట్టలేమా?
 
 కలుపు మందులతో చేటు..
 కాంగ్రెస్ గడ్డి నిర్మూలనకు చాలా మంది రైతులు రసాయనిక కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు మందులు చాలా ఖరీదైనవే కాకుండా.. వాటి వల్ల పంట భూమి, గాలి, నీరు, పర్యావరణం విషతుల్యమవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. దీని సమస్య ఎక్కువగా ఉన్న పొలాల్లో మెక్సికన్ బీటిల్ అనే పురుగులను ఎకరానికి 200 నుంచి 4 వేల వరకు వదలడం, బంతి మొక్కలు పెంచడం, పూతకు రాక ముందే వయ్యారి భామ మొక్కల్ని పీకి కంపోస్టు చేయడం.. వంటి పరిష్కారాలున్నా.. వీటిని అమలు చేయడం అంత సులభం కాకపోవడంతో ఈ మహమ్మారి కలుపు బతికిపోతోంది.
 
 అయితే, ఇక దీని పప్పులుడకవు. కేవలం.. కల్లుప్పు(సముద్రం ఉప్పు) ద్రావణాన్ని పిచికారీ చేసి వయ్యారిభామను పూర్తిగా నిర్మూలించే పద్ధతిని ప్రకృతి వ్యవసాయదారుడొకరు ఇటీవల కనుగొన్నారు. అతని పేరు తిరుమూర్తి. స్వస్థలం తమిళనాడులోని సత్యమంగళం. ఇదీ ఆయన అనుభవం.. తొలుత 10 లీటర్ల నీటిలో 1 కిలో కల్లుప్పు కలిపి పిచికారీ చేశాడు. ఫలితం లేదు. ఉప్పు మోతాదు 2, 3, 4, 5 కిలోలకు పెంచి చూశాడు. 10 లీటర్ల నీటిలో 5 కిలోల కల్లుప్పు (అంటే.. 2 లీటర్ల నీటికి కిలో కల్లుప్పు చొప్పున) కలిపిన ద్రావణాన్ని చల్లినప్పుడు చప్పున ఫలితం కనిపించింది. ఈ ద్రావణం చల్లిన కొద్ది గంటల్లోనే వయ్యారి భామ మొక్క వాడిపోయింది. తర్వాత పూర్తిగా మాడిపోయింది. ఉప్పు నీటి ప్రభావం వల్ల వయ్యారిభామ విత్తనాలు మొలకెత్తే శక్తిని కోల్పోవడాన్ని కూడా ఆయన గమనించాడు.
 
 కొబ్బరి తోటలో ఒక్కో చెట్టుకు ఏడాదికోసారి 2 కిలోల కల్లుప్పు వేయడం ఆయనకు అలవాటు. అయితే, కొబ్బరి తోటలో వయ్యారి భామ మొక్కలపై కల్లుప్పు ద్రావణాన్ని పిచికారీ చేస్తే చెట్లకు వేరుగా ఉప్పు వేయాల్సిన అవసరం లేకుండా పోయిందని తిరుమూర్తి గమనించారు. ఉప్పు ద్రావణం చల్లేటప్పుడు పండ్ల మొక్కలు, పంట మొక్కల ఆకులపై పడకుండా జాగ్రత్తపడటం అవసరం.  
 
 కాంగ్రెస్ గడ్డితో కంపోస్టు ఇలా..
 వయ్యారి భామ మొక్కల్లో మంచి పోషకాలున్నాయి. పూతకు రాకముందే ఈ మొక్కలను వేళ్లతో సహా పీకి కంపోస్టు చేసుకోవచ్చు. పొలంలో 3 అడుగుల లోతు గొయ్యి తీయాలి. పీకిన పార్థీనియం మొక్కలను వరుసలుగా వేయాలి. ఒక వరుస కలుపు వేసిన తరువాత దాని మీద ఆవు పేడను నీటిలో కలిపి చల్లుకోవాలి. ఇలా చివరి వరకు వరుసలుగా వేసిన తరువాత పైన పేడ కలిపిన మట్టితో మెత్తుకోవాలి. 60 నుంచి 90 రోజుల్లో చక్కటి నాణ్యమైన కంపోస్టు తయారవుతుంది. పార్థీనియం కంపోస్టులో ఇతర కంపోస్టు కంటే ఎక్కువ పోషకాలుంటాయి.
 
 పొలాన్ని పంటలు విత్తటానికి సిద్ధం చేసే సమయంలో.. పొలానికి నీటి తడి పెడితే.. వయ్యారి భామ విత్తనాలు మొలకెత్తుతాయి. అవి మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు కల్లుప్పు ద్రావణాన్ని పిచికారీ చేస్తే.. ఆ తర్వాత వేసే పంటకు వయ్యారి భామ బెడద తప్పుతుందని ఆయన సూచిస్తున్నారు. ధర తక్కువే కాబట్టి.. కల్లుప్పు ద్రావణం చల్లడానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. సులువైన పద్ధతే కాబట్టి.. మీరూ ఇలా చేసి చూడండి! అయితే, ఉప్పు ద్రావణం అతిగా చల్లినా భూసారం దెబ్బతినే ప్రమాదం ఉంది జాగ్రత్త. పార్థీనియం మహమ్మారిని మట్టుబెట్టే మరేదైనా మెరుగైన అనుభవం మీకుంటే... ‘సాగుబడి’ ద్వారా రైతులతో పంచుకోండి!
 - సాగుబడి డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement