గుప్త నిధుల పేరుతో మోసం
రూ.32 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు స్వాహా
న్యాయం కోసం మహిళ వేడుకోలు
కడప రూరల్ : గుప్త నిధుల పేరుతో వృద్ధులమైన తమను నిండా మోసగించారని హైదరాబాద్‌కు చెందిన వి.ఈశ్వరమ్మ ఆరోపించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను ఉద్యోగ విరమణ పొందడంతో హైదరాబాద్‌లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్లో నివసిస్తున్నానని తెలిపారు. పులివెందులకు చెందిన మీ-సేవా కేంద్రం మేనేజర్, ఒక పత్రికా విలేకరి (సాక్షి కాదు) తమ్మిశెట్టి అమర్నాథ్ తమకు సమీప బంధువని తెలిపారు. అతను తనకు బలపనూరులో ఒక తోట ఉందని, అందులో గుప్త నిధులు ఉన్నాయని తెలిపాడన్నారు.
అవి బయటికి తీయాలంటే ఖర్చుతో కూడుకున్న పని, అంత డబ్బు తన వద్ద లేదని, మీరిస్తే వెలికి తీస్తానని, పైగా అది నా తోటే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడన్నారు. డబ్బులు లేకపోయినా సరే వడ్డీకైనా తెచ్చిస్తే గుప్త నిధుల్లో సగం, లేక డబ్బులైనా తిరిగి ఇస్తానని నమ్మబలికాడన్నారు. తమ దగ్గర డబ్బులు లేకపోయినా వడ్డీకి తెచ్చి రూ. 32 లక్షలు నగదు, 23 తులాల బంగారు నగలు ఇచ్చామన్నారు. కొన్ని రోజుల తర్వాత మీ తోట వద్దకు వెళదామని చెబితే వద్దు.. అక్కడికి వస్తే మీ కూతురు చనిపోతుందని మమ్మల్ని భయపెట్టే వాడన్నారు.
మరికొన్ని రోజులకు వాకబు చేయగా, తమ అనుమానం నిజమేనని తేలిందన్నారు. ఆ మేరకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీకి ఫిర్యాదు చేయగా, ఆయన సమస్యను పరిష్కరించాలని పులివెందుల సీఐకి సిఫార్సు చేశారన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మోసగించిన విషయం వాస్తవమేనని గ్రహించి అతనిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తాము ఇచ్చిన డబ్బు, బంగారు నగలు తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆమె కుమారుడు గురురాజ్ పాల్గొన్నారు.