vechiles seez
-
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 295 వాహనాలు సీజ్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, పెద్దపల్లి జిల్లాలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధిక సంఖ్యలో సరైన ద్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. రఘునాథ్‌పాలెం పోలీసు స్టేషన్ పరిధిలోని శివాయిగూడెం కాలనీలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వయించారు. ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, రూరల్ ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్యర్యంలో ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తనీఖీలు నిర్వహించారు. మొత్తం 16 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు స్వాధీన పర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ తనీఖీల్లో పోలీసు కమీషనర్, రూరల్ ఏసీపీతో పాటు 110 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి 11 గంటలకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మొత్తంగా 150 ఇళ్లను, 500 మంది వ్యక్తులను, 150 ద్విచక్ర వాహనాలను, 2 కార్లను తనీఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 5 ద్విచక్ర వాహనాలను స్వాధీన పర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. 5 గురు అనుమానితులను కూడా విచారించినట్టు సమాచారం. ఈ తనీఖీలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ డి.ఉదయ్ కుమార్, జిల్లా డీఎస్పీ ఎస్.ఎం అలీ తో పాటు ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్సైలు, 10 మంది ఏఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 200 మంది పోలీసు అధికారులు ఈ తనీఖీల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి, సూర్యపేట జిల్లాల్లో కూడా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పెద్దపల్లి సుభాష్ నగర్, సాగర్ రోడ్డులో 95 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 ట్రాలీని అలాగే సూర్యపేట జిల్లాలో బంజర కాలనీ, అంబేద్కర్ కాలనీలో 121 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 వ్యాన్ స్వాధీన పర్చుకున్నట్టు పోలీసు తెలిపారు. సూర్యపేట తనీఖీల్లో జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్, కోదాడ డీఎస్పీ రమణరెడ్డి, మగ్గురు సీఐలు, 16 మంది ఎస్సైలతో పాటు 160 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో డీఎస్పీ కె.నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లాలోని చిలుకూరి లక్ష్మి నగర్, మహా లక్ష్మి వాడలో 200 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటి సోదాలు నిర్వహించి 39 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 ఆటో ట్రాలీలను సాధ్వీనం చేసుకున్నట్టు పోలీసు తెలిపారు. -
ఇసుక స్మగ్లర్లపై పీడీ యాక్టు
వాహనాల సీజ్.. నిరంతర నిఘా అక్రమ రవాణా నిరోధానికి మెుబైల్ టీమ్స్ సిరిసిల్ల ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అధికారులతో సిరిసిల్ల ఆర్డీవో సమావేశం కార్యాచరణకు సంయుక్త బృందాలు సిరిసిల్ల : ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు ఇసుక స్మగ్లర్లపై పీడీ యాక్టును ప్రయోగించాలని గనులశాఖ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా తరలించేవారు ఎవరైనా సరే కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించాలన్నారు. ఇసుక స్మగ్లర్లు రవాణాశాఖ అధికారులపై బుధవారం తెల్లవారుజామున దాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌కు ఆదేశాలిచ్చారు. వెంటనే ఆర్డీవో పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం సమష్టిగా ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ పి.సుధాకర్, మైనింగ్ ఏడీ సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీధర్, శ్రీనివాసరావు, ఎంవీఐ శ్రీనివాస్, మైనింగ్ ఏజీ కిరణ్, తహసీల్దార్లు పవన్, గంగయ్య, రేణుకాదేవి, సదానందం, శ్రీనివాస్, రవీంద్రచారి, ప్రసాద్, రమేశ్, డీటీ దివ్య, ఎస్సైలు మారుతి, శ్రీనివాస్, రాజ్‌కుమార్‌గౌడ్, డీఏఓ వేణు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు – ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేయాలి. ఆ తరువాత ఏ వాహనంలోనూ రవాణా చేయెుద్దు. ఒకవేళ్ల చేస్తే కేసు నమోదు చేయాలి. – రెవెన్యూ పర్మిట్ లేకుండా ఇసుక రవాణా చేయడం నేరం. నిర్ధిష్ట సమయాల్లో స్థానిక అవసరాలకు పర్మిట్లు జారీ చేయాలి. – సిరిసిల్ల మండలం జిల్లెల్ల వద్ద చెక్‌పోస్ట్‌ను బలోపేతం చేయాలి. – పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఎంవీఐ అధికారులతో మెుబైల్ టీమ్‌ల ఏర్పాటు. – వేయింగ్ బ్రిడ్జిల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు. – ఇసుక క్వారీ వద్దనే ఓవర్ లోడు నియంత్రణ. – ఇసుక నిల్వలు, డంపులున్న భూయజమానిపై కేసు పెట్టాలి. ఆ ఇసుకను వెంటనే వేలం వేసి తరలించాలి. – క్షేత్రస్థాయి పనితీరుపై రోజువారి నివేదికలను కలెక్టర్‌కు అందించాలి. శనివారం నుంచే కార్యాచరణ ప్రారంభించాలని అధికారుల సమావేశంలో నిర్ణయించారు.