- వాహనాల సీజ్.. నిరంతర నిఘా
- అక్రమ రవాణా నిరోధానికి మెుబైల్ టీమ్స్
- సిరిసిల్ల ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్
- అధికారులతో సిరిసిల్ల ఆర్డీవో సమావేశం
- కార్యాచరణకు సంయుక్త బృందాలు
ఇసుక స్మగ్లర్లపై పీడీ యాక్టు
Published Fri, Jul 29 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
సిరిసిల్ల : ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు ఇసుక స్మగ్లర్లపై పీడీ యాక్టును ప్రయోగించాలని గనులశాఖ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా తరలించేవారు ఎవరైనా సరే కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించాలన్నారు. ఇసుక స్మగ్లర్లు రవాణాశాఖ అధికారులపై బుధవారం తెల్లవారుజామున దాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌కు ఆదేశాలిచ్చారు. వెంటనే ఆర్డీవో పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం సమష్టిగా ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ పి.సుధాకర్, మైనింగ్ ఏడీ సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీధర్, శ్రీనివాసరావు, ఎంవీఐ శ్రీనివాస్, మైనింగ్ ఏజీ కిరణ్, తహసీల్దార్లు పవన్, గంగయ్య, రేణుకాదేవి, సదానందం, శ్రీనివాస్, రవీంద్రచారి, ప్రసాద్, రమేశ్, డీటీ దివ్య, ఎస్సైలు మారుతి, శ్రీనివాస్, రాజ్‌కుమార్‌గౌడ్, డీఏఓ వేణు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
– ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక రవాణా చేయాలి. ఆ తరువాత ఏ వాహనంలోనూ రవాణా చేయెుద్దు. ఒకవేళ్ల చేస్తే కేసు నమోదు చేయాలి.
– రెవెన్యూ పర్మిట్ లేకుండా ఇసుక రవాణా చేయడం నేరం. నిర్ధిష్ట సమయాల్లో స్థానిక అవసరాలకు పర్మిట్లు జారీ చేయాలి.
– సిరిసిల్ల మండలం జిల్లెల్ల వద్ద చెక్‌పోస్ట్‌ను బలోపేతం చేయాలి.
– పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఎంవీఐ అధికారులతో మెుబైల్ టీమ్‌ల ఏర్పాటు.
– వేయింగ్ బ్రిడ్జిల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు.
– ఇసుక క్వారీ వద్దనే ఓవర్ లోడు నియంత్రణ.
– ఇసుక నిల్వలు, డంపులున్న భూయజమానిపై కేసు పెట్టాలి. ఆ ఇసుకను వెంటనే వేలం వేసి తరలించాలి.
– క్షేత్రస్థాయి పనితీరుపై రోజువారి నివేదికలను కలెక్టర్‌కు అందించాలి. శనివారం నుంచే కార్యాచరణ ప్రారంభించాలని అధికారుల సమావేశంలో నిర్ణయించారు.
Advertisement
Advertisement