వీణవంక అత్యాచారంపై సభలో రభస
సాక్షి, హైదరాబాద్: వీణవంక అత్యాచార ఘటనపై ఆదివారం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార పక్షం మధ్య రభస చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా వీణవంక పోలీసు స్టేషన్ పరిధిలో గత ఫిబ్రవరి 10న దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్రహోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సభలో ప్రకటన చేశారు. హోంమంత్రి ప్రకటనపై స్పష్టత కోరేందుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేయడంతో వివాదం ప్రారంభమైంది. ఏదైన ముఖ్యమైన అంశంపై మంత్రులు సభలో చేసిన ప్రకటనపై స్పష్టత కోరేందుకు సభా నిబంధనలు అంగీకరించవని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు రూల్‌బుక్‌ను చదివి వినిపించారు. హోంశాఖ పద్దులపై జరిగే చర్చలో ఈ ఘటనపై స్పష్టత కోరితే బదులిస్తామన్నారు.
దీంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పొడియం వద్దకు చేరి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఆందోళనకు దిగారు. దళిత యువతిపై జరిగిన అత్యాచారం ఘటనపై దర్యాప్తులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సరైన పద్ధతిలో వస్తే ఈ ఘటనపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ బదులిచ్చారు. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ సభ్యులు ఇలా వ్యవహరించడం సరికాదని మంత్రులు హరీష్ రావు, కడియంలు తప్పుబట్టారు. రెండు మూడు నిమిషాలు సమయం ఇస్తే సరిపోతుంది అని సీఎల్పీ నేత జానారెడ్డి కోరినా ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులందరూ వాకౌట్ చేశారు.
బాధితురాలికి ఉద్యోగం..
వీణవంక అత్యాచార బాధితురాలికి చట్ట ప్రకారం అందాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించామని, జీఓఎంఎస్ నెం.8 కింద ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పింమని ప్రతిపాదనలు పంపించామని మంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్ఐ, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. బాధితురాలిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్కు చార్జీ మెమో ఇచ్చామన్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కరీంనగర్ మహిళా ఏఎస్పీకి ఇచ్చామన్నారు.