కాజోల్ పక్కన నటించడమే చాలెంజ్
తమిళసినిమా: నటి కాజోల్ పక్కన ఫ్రేమ్‌లో నిలబడడమే ఛాలెంజ్‌గా భావించానని నటుడు ధనుష్ పేర్కొన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రాల్లో వేలై ఇల్లాపట్టాదారి 2(వీఐపీ– 2) ఒకటి. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను, ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలను అందించింది నటుడు ధనుష్ కావడం విశేషం.
రజనీకాంత్ హీరోగా కోచ్చడైయాన్ అనే తొలి 3డీ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించిన సౌందర్యరజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వీఐపీ 2. నటి అమలాపాల్ నాయకిగా, బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శాన్రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో వీఐపీ– 2 పేర్లతోనూ హిందీలో పాల్కర్ పేరుతో విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
కాగా ఈ చిత్ర మూడు భాషల ఆడియో, టీజర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ముంబాయిలోని పీవీఆర్ సినిమాలో నిర్వహించారు. ఇదే రోజు నిర్మాత కలైపులి ఎస్. థాను పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కాగా కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకులు బాల్కీ, ఆనంద్.ఎల్.రాయ్‌లతో పాటు లతారజనీకాంత్ తదితరులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాఆంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర కథకుడు, మాటల రచయిత, కథానాయకుడు ధనుష్ విలేకరులతో ముచ్చటించారు.
♦ వీఐపీ– 2 చిత్రం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
జ: వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ) చిత్రం మంచి విజయాన్ని మించి అమ్మ సెంటిమెంట్, ప్రేమ, తమ్ముడుతో అనుబంధం, యాక్షన్ అంటూ జనరంజకమైన అంశాలతో కూడినది. దాన్ని అలా వదిలేయకూడదని ఆ చిత్ర విడుదలైన సమయంలోనే అనిపించింది. అయితే అలాంటి కథ«ను సిద్ధం చేయడం సవాల్‌గా మారింది. దానికి మించిన స్థాయిలో కాన్సెప్ట్స్ కోసం ఏడాదిన్నర కాలంపాటు ఆలోచించాను. అలా పొల్లాచ్చిలో కొడి చిత్ర షూటింగ్ సమయంలో వచ్చిన థాట్‌తో తయారు చేసిన కథతో రూపొందించిన చిత్రం ఈ వీఐపీ– 2. వీఐపీ చిత్రంలో మాదిరిగానే ఇందులోనూ అమ్మసెంటిమెంట్, నాన్న, తమ్ముడు, అర్ధాంగి, స్నేహితులు అనే అన్ని అంశాలు ఉంటాయి.
♦ వీఐపీ– 2 చిత్రాన్ని తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయాలను కోవడానికి కారణం?
జ: నిజం చెప్పాలంటే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని ముందు అనుకోలేదు. ఇటీవల బాహుబలి, దంగల్ లాంటి చిత్రాలు అన్ని భాషల్లోనూ పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వీఐపీ– 2 చిత్రంపైనా మంచి అంచనాలు నెలకొనడంతో తాము అలాంటి ప్రయత్నం చేయాలనుకున్నాం. అందుకే ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చాం.
♦ హిందీ నటి కాజోల్‌తో నటించిన అనుభవం గురించి?
జ: నేను చదువుకునే రోజుల్లోనే ఆమె నటించిన చిత్రాలను చేసేవాడిని. ఇప్పటికీ 14, 15 ఏళ్ల వయసు ఎనర్జీ కలిగిన నటి కాజోల్. వీఐపీ– 2 చిత్రం తమిళ భాషలో సంభాషణలు చెప్పి నటించడానికి మొదటి రెండు రోజులు కష్టపడినా, తరువాత వాటిని బట్టీపట్టి అద్భుతంగా నటించారు. కాజోల్ చాలా మంచి నటి. ఆమె పక్కన ఫ్రేమ్‌లో నిలబడటమే నాకు ఛాలేంజ్ అనిపించింది. కాజోల్‌తో కలిసి నటించడం ఓ మంచి అనుభవం
♦ ఈ చిత్రాన్ని మీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలోనూ, వీఐపీ– 2 చిత్రాన్ని ఆమె చెల్లెలు సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలోనూ నటించారు. ఇద్దరిలో వ్యత్యాసం గురించి?
జ: ఇద్దరి మధ్య వ్యత్యాసం గురించి కంటే ఏకత్వం గురించి చెప్పాలి. సినిమాపై వారి నిజాయితీ, అంకితభావం, తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన, కఠిన శ్రమను గుర్తించాను. ఇద్దరూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. మహిళా దర్శకులను ప్రోత్సహించడం ఘనతగా భావిస్తున్నాను.
♦ పవర్‌పాండి– 2 చిత్రాన్ని చేస్తానన్నారు. అదెప్పుడు?
జ: పవర్‌పాండి– 2 చిత్రానికి కథను సిద్ధం చేశాను. అందులో నటించడానికి రాజ్‌కిరణ్ సంసిద్ధత వ్యక్తం చేశాడు. అయితే ఆ చిత్రాన్ని వెంటనే ప్రారంభిద్దామా? వేరే చిత్రం చేసిన తరువాత పవర్‌పాండి– 2ను చేద్దామా, అన్న ఆలోచనలో ఉన్నాను.
♦ కొడి తరువాత ద్విపాత్రాభినయం మళ్లీ ఎప్పుడు చేస్తారు?
జ: ఏదైనా వైవిధ్యంగా ఉండాలని ఆశిస్తాను. కొడి చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన పాత్రల రూపాలు ఒకేలా ఉన్నా, వాటి అభినయంలో వైవిధ్యంగా ఉంటుంది. అలాంటి మంచి కథ వస్తే ద్విపాత్ర చేయడానికి నేను రెడీ.
♦ నటుడు, కథారచయిత, గాయకుడు, నిర్మాత, దర్శకుడు వంటి పలు రంగాల్లో రాణిస్తున్నారు. మీలో ఇంత ఎనర్జీకీ కారణం?
జ: నా కొడుకులు యాత్ర, లింగాలే నాకు ఎనర్జీ. వారు పెరిగి 18 ఏళ్ల వయసుకు చేరే సరికి వారు గర్వపడేలా తాను ఉన్నత స్థాయికి చేరుకోవాలి.