చంద్రబాబూ.. మాట నిలుపుకో
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలుపుకోవాలని కోరుతూ ఆదివారం స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. శిబిరంలో అసోసియేషన్ అధ్యక్షుడు అత్తింటి వీరవెంకట సుబ్బరాజు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీలను గెలిపించినందుకు కృతజ్ఞతగా పశ్చిమకు నిట్ ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, ఆ హామీ మేరకు నిట్ ఏర్పాటు చేయాలన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాసరాంరాయ్ మాట్లాడుతూ నిట్ ఏర్పాటు చేస్తే జిల్లాలోని విద్యార్థులకు మంచి ఉన్నత విద్య అవకాశాలు వస్తాయన్నారు.
కోశాధికారి సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ నిట్ వేరే జిల్లాకు తరలిపోయిందన్న వార్తలు బాధ కలిగిస్తున్నాయని తాడేపల్లిగూడెంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. అప్పటి వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. రిలే దీక్షల్లో అత్తింటి వీరవెంకట సుబ్బరాజు, జంగా శ్రీనివాసరాంరాయ్, ఎస్.శ్రీనివాసు, టీఎస్.శ్రీనివాస్, జి.సుధీర్కుమార్రాజు, గురువు హరిబాబు, జి.వెంకటశ్రీనివాసులు, కొండవీటి మోహనరావు, ఎంవీ రాంప్రసాద్, వాకలపూడి రామకృష్ణ, జి.శ్రీనివాసు, గంధం ప్రభాకర్ , జి.చిరంజీవి, కె.రామకృష్ణ, గుంపుల సత్యకృష్ణ, కె.రామకృష్ణ, పైలు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
నిట్ ఎక్కడికీ పోదు : మంత్రి
మాణిక్యాలరావు
నిట్ ఎక్కడికీ పోదని, ఇక్కడికి వస్తుందనే నమ్మకం ఉందని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం ఆయన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన బృందాలు ఇక్కడి స్థలాలను చూసి సంతృప్తిని వ్యక్తం చే శాయన్నారు. దీనికోసం ఏర్పాటు చే సిన బృందం కొన్ని కొర్రీలు వేసిందన్నారు. నిట్ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించానని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా కేంద్ర నాయకులను నిట్ విషయమై మాట్లాడతానని మాణిక్యాలరావు అన్నారు. ఆయనతో పాటు మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు దీక్షా శిబిరానికి మద్దతు ప్రకటించారు. మునిసిపల్ మాజీ చైర్మన్, రాష్ట్ర హోల్సేల్ ఎరువుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఈతకోట తాతాజీ దీక్షలకు మద్దతు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు.