శేషాచలం అడవుల్లో వీరప్పన్ అనుచరులు!
హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికివేసి, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాల్లో చనిపోయిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మాజీ అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసు, అటవీశాఖల అధికారులు నిర్ధారించారు. పోలీసు, అటవీ శాఖల అధికారుల భయంతో ఈ చెట్లను నరికే పని చేయడానికి స్థానికులు వెనుకడుగు వేస్తుండటంతో స్మగ్లర్లు.. వీరప్పన్, అతడి ప్రధాన అనుచరుల వద్ద ఏళ్ల పాటు పని చేసిన తమిళనాడుకు చెందిన కూలీలకు అధిక మొత్తాల ఆశచూపి రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం ముఠాలు ఆకర్షిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.
ప్రత్యేకంగా ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌నే ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్ కనుసన్నల్లో పని చేసి ఉండటంతో.. పోలీసులే ఎదురుపడి కాల్చి చంపుతామని బెదిరించినా వీళ్లు లొంగకుండా ఎదురు దాడికి దిగుతున్నారని.. రాళ్లు, మారణాయుధాల తో దాడికి పాల్పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. అలాగే.. తెరవెనుక నుంచి ఈ కూలీల ముఠాలను నిర్వహిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మణిపూర్‌కు చెందిన స్మగ్లర్లూ ఉన్నట్లు పోలీసు, అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.