Vegetable sellers
-
కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్
లక్నో : కూరగాయల వ్యాపారులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో వీరి దగ్గరి నుంచి ఎవరెవరు కూరగాయలు కొన్నారు? వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు ఎవరు అన్న విషయాలు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గడిచిన 10 రోజుల్లోనే 28 మంది కూరగాయల వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీరిలో ఎక్కువమంది బాసాయి, తాజ్‌గంజ్ మండీల్లో కూరగాయలు విక్రయించేవారని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆగ్రాలో కూరగాయల వ్యాపారులకు కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా మిగతా వీధి వ్యాపారులు, కిరాణా వ్యాపారులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. (వలస కూలీల్లో కరోనా కలకలం ) అయితే అత్యధికంగా కూరగాయల వ్యాపారులకు కోవిడ్ సోకింది. వీరికి వైరస్ ఎలా సోకిందనే విషయం ఇంకా తెలియలేదు. దీంతో వీరి దగ్గర కూరగాయలు కొన్న కొంతమందిని గుర్తించి క్వారంటైన్లో ఉంచారు. 160 మంది కూరగాయల వ్యాపారులు, వీధి వ్యాపారులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 28 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో కరోనా నివారణ నిమిత్తం ఇంటింటికీ కూరగాయలు ప్యాకెడ్ కవర్లలో డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఆగ్రా ఎస్పీ రోహన్ బోట్రే తెలిపారు. ఇప్పటికే 20 వార్డుల్లో ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేస్తున్నామని, త్వరలోనే 100 వార్డుల్లో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆగ్రా మండీ సెక్రటరీ శివకుమార్ పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించేలా అన్ని పండ్ల దుకాణాలు, ఇతర వీధి మార్కెట్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. (ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్ చేసి..) -
చేతికి అందిన కల
ఆకాశంలో చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెట్టేటప్పుడు ఆ అమ్మ తన బిడ్డ కలలు ఆకాశంలో విహరిస్తున్నాయని ఊహించనైనా ఊహించలేదు. అప్పుడే కాదు, మనదేశం చంద్రయాన్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు కూడా ఆ అమ్మానాన్నకు తమ కూతురు ఆలోచనలు అంతరిక్షంలో ఉన్నాయని తెలియదు. ‘తను అంత పెద్ద కలలు కంటోందని మేము ఊహించనే లేదు’ అంటున్నారు లలిత తల్లిదండ్రులు! కర్నాటక రాష్ట్రం, చిత్రదుర్గ జిల్లా హరియూర్ పట్టణం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. లలిత అనే ఇరవై రెండేళ్ల అమ్మాయి సాధించిన స్టేట్ ఫస్ట్ ర్యాంకుతో హరియూర్‌తోపాటు లలిత అమ్మానాన్న.. రాజేంద్ర, చిత్రలు కూడా సెలబ్రిటీలయ్యారు. బెలగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్న లలిత ఫైనల్ పరీక్షల్లో 9.7 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది! ఈ పర్సెంటేజ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు. వారం రోజులుగా చిత్రదుర్గ జిల్లా మొత్తం ఈ సంబరాన్ని ఆస్వాదిస్తోంది. ‘ఏటా ఎవరో ఒకరు ఫస్ట్ ర్యాంకు సాధిస్తూనే ఉంటారు కదా’ అనే ప్రశ్న మామూలే. కానీ లలితది.. అమ్మానాన్నలు అరచేతుల్లో నడిపించి మరీ చదివించిన నేపథ్యం కాదు. హరియూర్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం గడుపుతున్న కుటుంబం వాళ్లది. ముగ్గురమ్మాయిలను పట్టుదలగా స్కూలుకు పంపించారు. వాళ్ల పెద్దమ్మాయే లలిత. తల్లిదండ్రుల కష్టం తెలిసిన అమ్మాయిలు కావడంతో ఇప్పటికీ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి మార్కెట్‌కు కూరగాయల చేరవేతలో తండ్రికి సహాయంగా ఉంటున్నారు. ఇంటి పనులు ముగించుకుని తల్లి వచ్చి మార్కెట్లో కూర్చునే లోపు కూతుళ్లలో ఎవరో ఒకరు దుకాణంలో ఉంటారు. ఆ తర్వాత కాలేజీలకు వెళ్తారు. అలా లలిత కూడా మార్కెట్‌కు వెళ్లేటప్పుడు కూరగాయలతోపాటు పుస్తకాలు కూడా పట్టుకెళ్లేది. ఆ అమ్మాయి దుకాణంలో కూర్చుని చదువుకుంటూ, బేరం వచ్చినప్పుడు కూరగాయలమ్మడం ఆ మార్కెట్లో తోటి వ్యాపారులకే కాదు, కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్లకు కూడా పరిచిత దృశ్యమే. లలిత స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అని తెలియగానే ఇప్పుడు ఆమెను తెలిసిన వాళ్లందరూ తమ ఇంటి బిడ్డ సాధించిన విజయంగా సంతోషపడుతున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం ఆమెకు బంగారు పతకాన్ని బహూకరించారు.లలిత ఆ ఇంట్లో తొలి గ్రాడ్యుయేట్. వేడుక చేసుకోవడానికి అదే పెద్ద సందర్భం అనుకుంటే.. స్టేట్ ఫస్ట్‌ర్యాంకుతో పాస్ కావడం, బంగారు పతకం అందుకోవడంతో రాజేంద్ర, చిత్రల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లలిత మాత్రం ‘‘మమ్మల్ని చదివించడానికి అమ్మానాన్న పడిన కష్టం తెలుసు. వాళ్లు గర్వపడేలా ఎదుగుతాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఇస్రో చైర్మన్ శివన్ నాకు ఆదర్శం. అంతరిక్ష పరిశోధన చేయడం నా కల’’ అంటోంది. -
ముద్రగడకు కూరగాయల వర్తకుల మద్దతు
- ఖాళీ కంచాలపై గరిటెలతో డప్పు వేసిన వర్తకులు నరసరావుపేట (గుంటూరు) : తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టోలో పొందుపరచిన కాపుల రిజర్వేషన్‌ను అమలుచేయాలని కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతు పెరుగుతోంది. నరసరావుపేటలోని లాల్‌బహదూర్ కూరగాయల మార్కెట్ వర్తకులు శనివారం కూరగాయల మార్కెట్ ముందు ఖాళీ కంచాలపై గరిటెలతో డప్పు వాయిస్తూ ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్‌పై వెంటనే జీవో జారీచేయాలని, కాపు నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. లాల్‌బహదూర్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనకు వర్తక సంఘ అధ్యక్షుడైన షేక్ ఆదంషఫీ కూడా పాల్గొని మద్దతును తెలియజేశారు.