ఈడీ కొరడా : రూ.1610 కోట్ల వాహనాలు సీజ్
సాక్షి, న్యూఢిల్లీ: మోసం, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6వేల కార్లను ఎటాచ్ చేసింది. వీటి విలువ 1610 కోట్ల రూపాయలు. సూరత్‌కు చెందిన సిద్ధి వినాయక్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎస్విఎల్ఎల్) సంస్థ ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకులో చోటు చేసుకున్న రూ. 836.29 కోట్ల స్కాంకు సంబంధించి ఈడీ ఈ చర్య చేపట్టింది.
నకిలీ పత్రాల, నకిలీ పేర్లతో భారీ ఎత్తు రుణాలు, నిధుల మళ్లింపుతోపాటు, అనేక అవతవకల ఆరోపణల నేపథ్యంలో ఎస్విఎల్ఎల్ కంపెనీపై 2016లో సీబీఐ కేసులు నమోదు చేసింది. అనంతరం రంగంలోకి దిగిన ఈడీ కంపెనీ, దాని డైరెక్టర్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ డైరెక్టర్ రూప్‌చంద్ బైద్‌ను గతంలోనే అరెస్ట్ చేసింది. వ్యక్తిగత లాభాల కోసం సంస్థ ఉద్యోగులు, డ్రైవర్ల పేర్లతో, తప్పుడు పేపర్లను ఉపయోగించి బ్యాంకుల నుండి అనేక రుణాలు పొందిందనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఈ అక్రమాల్లో రూప్‌చంద్ కీలక పాత్ర పోషించాడని, సంబంధిత సంస్థల వివిధ ఖాతాల ద్వారా రుణాలను పొంది, వాటిని దారి మళ్లించినట్టుగా దర్యాప్తులో తేలిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
2002 నుంచి సిద్ధి వినాయక్ లాజిస్టిక్ లిమిటెడ్ ముంబై ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చాలక్ సే మాలక్ (డ్రైవర్ టూది ఓనర్) పేరుతో పాత, కొత్త వాహనాల కొనుగోలుపై వివిధ రుణ సదుపాయాలందిస్తుంది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, ఎన్‌సిఆర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నెట్ వర్క్ ఉంది. మరోవైపు ఇప్పటికే (2017, జూన్) 19 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది.
ED attaches movable properties comprising 6170 vehicles worth Rs.1609.78 Crores of M/s Sidhi Vinayak Logistics Ltd (SVLL), Mumbai in a bank fraud case under PMLA, 2002.
— ED (@dir_ed) June 18, 2019