గోమాతకు ప్రకృతి శాంతి పూజలు
వెలుగుబంద (రాజానగరం) :
సకల దేవతామూర్తులు కొలువై ఉన్న గోమాతను పూజించాల్సిన సమయంలో హింసించడం వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని రక్షించగల శక్తి ఒక్క గోమాతకే ఉందన్నారు. ప్రపంచ శాంతిని కోరుతూ రాజానగరం మండలం, వెలుగుబందలో మంగళవారం గోమాతకు ప్రకృతి శాంతి పూజలు చేశారు. అదే గ్రామానికి చెందిన ప్రగడ సత్యనారాయణ ఆధ్వర్యంలో గోగాయత్రీ మంత్రపఠనం, కామధేను కలశపూజ, గో ప్రదక్షిణ చేశారు. రానున్న కొత్త సంవత్సరం అంతా హాయిగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని కాపాడాలని వేడుకున్నారు.