velugu scheme
-
కడుపు కాలి రోడ్డున పడ్డాం
కడప రూరల్ : తమకు ఉద్యోగ భద్రత లభించే వర కు ఉద్యమం ఆగదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ వెలుగు ఉద్యోగుల జేఏసీ సభ్యులు స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వారు చేపట్టిన సమ్మె బుధవారానికి 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలి నుంచి దాదాపు 200 మంది సిబ్బంది కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా యాని మేటర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుదాస్, ఆ జేఏసీ సభ్యులు గూగూడు, నరసింహులు, నీలకంఠారెడ్డి, సత్యనారాయణ మాట్లాడుతూ వెలుగు సంస్ధలో కష్టించి పనిచేస్తున్నా తమకు ఇంతవరకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తమ కడుపులు కాలి రోడ్డు మీదకు వచ్చామన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ డిమాండ్స్‌ను నెరవేరుస్తామని చెప్పి, మోసగించారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత లభించే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సుబ్బనాయుడు, అనంతయ్య, రామాంజనేయులు, అపర్ణ, సురేష్, రెడ్డెయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం రాష్ట్ర ప్రభుత్వం వెలుగు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సభ్యులతో బుధవారం విజయవాడలో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముందు మీరు సమ్మె ను విరమించండి, మీ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తామని సెర్ఫ్ సీఈఓ తెలిపారు. అందుకు ఆ జేఏసీ సభ్యులు తమకు ఉద్యోగ భధ్రత లభించే వరకు సమ్మెను విరమించమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విరమించమని ఉద్యోగులను బెదిరిస్తోంది, ఆ మేరకు దిగువస్థాయి కేడర్‌ను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆ జేఏసీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె మరింతకాలం కొనసాగనుంది. ఫలి తంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్ధలో అమలవుతున్న దాదాపు 17కు పైగా పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడనుంది. -
కంటి వెలుగుపై గవర్నర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఈ నెల15 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు పథకంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆరా తీశారు. ఈ పథకం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి కంటి వెలుగు పథకం గురించి వివరించారు. ‘అంధత్వ రహిత తెలంగాణ’దిశగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగని వారు వివరించారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు చేశాక అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ, ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. సాధారణ కంటి వ్యాధులున్న వారికి ఉచిత మందులను అందిస్తామన్నారు. -
అంధకారంలో వెలుగు పథకాలు
మూతపడిన న్యూట్రిషన్, బాలబడి కేంద్రాలు ఆదుకోని మార్కెటింగ్ అందని మా ఇంటి మహాలక్ష్మి సీతంపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు పథకాలను ఒక్కొక్కటి తుంగలోకి తొక్కేసింది. వెలుగు అంథకారంలోకి వెళ్లిపోతుంది. గిరిజనోద్దరణకు ఏర్పాటు చేసిన టీపీఎంయూ (ట్రైబల్ ప్రాజెక్టు మానటరింగ్ యూనిట్) అటు సిబ్బంది లేక ఇటు పథకాలకు నోచుకోక అంథకారంలోకి వెళ్లిపోయింది. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మందస, మెళియాపుట్టి మండలాల్లోని గిరిజనులను ఉద్దరించడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెలుగు పథకాలు మూలన పడుతున్నాయి. ఒక్కో పథకానికి మంగళం పాడేయడం పరిపాటిగా మారిపోయింది. మొన్న న్యూట్రిషిన్ కేంద్రాలు మూతపడ్డాయి. నిన్న బాలబడులు కూడా మూసివేశారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, బాలింతలు, గర్బిణులకు పోషకాహారం ఎండమావిగా మారింది. అలాగే చిన్నారులకు ఆటపాటల ద్వారా అందించే బాలబడులు విద్యాకార్యక్రమాలు మూలనపడినట్టయింది. మాఇంటి మహాలక్ష్మికి గ్రహణం మాఇంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ప్రయోజనం చేకూరే విధంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుత ప్రభుత్వం నిలుపు చేసింది. ఈ పథకాన్ని వెలుగు నుంచి ఐసీడీఎస్‌కు బదిలీ చేసినా అక్కడ కూడా చిరునామా కరువైంది. ఏడు మండలాల్లో 2,400 మంది గిరిజన బాలికల పేర్లు అప్పట్లో నమోదయ్యాయి. వాటిలో తొలివిడతగా 1,190 మందికి మాత్రమే నగదు బ్యాంకు ఖాతాలో వేశారు. ఐటీడీఏ పరిధిలో మరో 1,210 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. రెండేళ్లుగా వీటిపై స్పందన లేదు. ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఈ పథకం కొనసాగుతుందా లేదాననే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తి చేసేవరకు ఏటా కొంతమెుత్తాన్ని చెల్లిస్తారు. బిడ్డ పుట్టిన వెంటనే టీకాల నిమిత్తం వెయ్యి రూపాయలు, మరో రూ.2,500 ఒకటి, రెండు సంవత్సరాల్లో ఏడాదికి వెయ్యి, 3, 4, 5 ఏళ్లలో సంవత్సరానికి రూ.1,500లు ఇస్తారు. అయిదేళ్ల తర్వాత పాఠశాలకు బాలికను పంపింతే ఏడాదికి రూ.2 వేలు అందజేస్తారు. 6 నుంచి 8వ తరగతి వరకు రూ.2,500లు, 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ.3 వేలు చెల్లించనున్నారు. ఇంటర్ వరకు చదివితే నెలకు రూ.3,500లు, ఇంటర్ పూర్తిచేస్తే రూ.50వేలు, డిగ్రీ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అందించాలి. ఈ పథకం కానరాకుండా పోయింది. అంతంత మాత్రంగానే మార్కెటింగ్ గిరిజనుల ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నడిపి వారికి అన్ని విదాలా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్ధేశంతో పసుపు, చింతపండు, జీడి ప్రొసెసింగ్ కేంద్రాలు గతంలో అయిదు చోట్ల ఏర్పాటు చేశారు. ఇందుకు ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే వెలుగు ద్వారా సరైన ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక మూత పడ్డాయి. ఐటీడీఏ ప్రాంగణంలో జీడి, పసుపు, చింతపండు కేంద్రాల కోసం నూతనంగా భవనాలు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ కేంద్రాలు తెరవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నా చింతపండు, పసుపు వంటివాటికి సీజన్ కాకపోవడంతో అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం జీవనోపాధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మార్కెటింగ్ కేంద్రాలు కూడా నడపడానికి చర్యలు తీసుకుంటున్నాం. కొండచీపుర్లు, పినాయిల్ తయారీ జరుగుతుంది. ప్రస్తుతానికి బాలబడి, న్యూట్రిషియన్ కేంద్రాలను మూసివేయడం జరిగింది. – కె.సావిత్రి, ఏపీడీ, వెలుగు. వెలుగు పథకాలన్నీ నిర్వీర్యమే వెలుగు పథకాలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పథకాలన్నీ మూతపడ్డాయి. మహిళా సంఘాలకు వెలుగు పథకాలు ఏవీ అక్కరకు రావడం లేదు. ఉన్నవాటిని మూసివేయడం తగదు. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెలే, పాలకొండ. -
వెలుగుల పథకంలో అన్నీ ఒడిదొడుకులే
హుజూర్నగర్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 50 యూనిట్లలోపు విద్యుత్ భారాన్ని భరిస్తూ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ వెలుగుల పథకం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారులను గుర్తించడం విద్యుత్‌శాఖ అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రతి లబ్ధిదారుడు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 31 నాటికి అందజేయాలని ఆదేశాలు జారీచేశారు. వాస్తవంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చినెలలోనే ప్రవేశపెట్టినప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువడేందుకు కొంత సమయం పట్టింది. ఈ క్రమంలో మూడవ విడత రచ్చబండలో అధికారికంగా ప్రకటన చేస్తూ డిసెంబర్ నెలలో కరెంటు బిల్లుల మాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో ఈ పథకం ద్వారా సుమారు 50వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఉన్నట్టు విద్యుత్‌శాఖ వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా గుర్తించింది. అయితే సదరు లబ్ధిదారుల్లో సుమారు 10వేల మంది నకిలీలు ఉన్నట్లు గమనించిన అధికారులు బిత్తరపోయారు. భారంగా మారిన అసలు లబ్ధిదారుల గుర్తింపు ఈ పథకాన్ని విధి విధానాలను రూపొందించకుండా ప్రవేశపెట్టడం తో అసలు లబ్ధిదారులను గుర్తించడం తలకు మించిన భారంగా తయారైంది. ఒక దశలో సాంఘిక సంక్షేమశాఖ ద్వారా వివరాలు తెప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ జాబితా కూడా పారదర్శకంగా ఉంటుందనే నమ్మకం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే విద్యుత్‌శాఖ అనేక ఒడిదుడుకుల మధ్య నడుస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత వెలుగుల పథకం కాస్తా సంబంధిత శాఖ అధికారులకు ఇబ్బందిగా మారింది. లబ్ధిదారులను గుర్తించేందుకు అర్హులైన వారి నుంచి కుల ధ్రువీకరణ పత్రాలను సేకరించాలని నిర్ణయించారు. అసలైన లబ్ధిదారులు కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 50 యూనిట్ల విద్యుత్ సరిపోయేనా... ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రతి ఇంట్లో టీవీ, ఫ్యాను, ఒకటో రెండో కరెంటు బల్బులు ఉండడం సాధారణమైపోయింది. ఎంత పొదుపుగా విద్యుత్ వినియోగించుకున్నప్పటికీ 50 యూనిట్లు దాటుతుందని లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రచారం తప్ప ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఎటువంటి మేలూ జరగదంటూ పెదవి విరుస్తున్నారు. అయితే రానున్న కాలంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక ప్రతినెలా ఈ పథకం ద్వారా ఎంత మందికి ప్రయోజనం చేకూరుతుందో వేచి చూడాల్సిందే.